ముంబయి వాంఖడే వేదికగా బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో చెన్నై 69 పరుగుల తేడాతో విజయం సాధించింది. 20 ఓవర్లలో 122 పరుగులకు పరిమితమైంది ఆర్బీబీ. ఓపెనర్ పడిక్కల్(15 బంతుల్లో 34 పరుగులు), మ్యాక్స్వెల్(15 బంతుల్లో 22 పరుగులు) రాణించినప్పటికీ.. నిలకడలేమితో ఆర్సీబీ పరాజయం పాలైంది. ఈ సీజన్లో తొలి ఓటమిని చవిచూసింది కోహ్లీ సేన. చెన్నై బౌలర్లలో జడేజా 3, తాహిర్ 2 వికెట్లతో అద్భుత ప్రదర్శన చేశారు.
లక్ష్య ఛేదనలో బెంగళూరు జట్టుకు అదిరే ఆరంభం లభించింది. తొలి 3 ఓవర్లలోనే 44 పరుగులు జోడించింది ఓపెనింగ్ జోడీ. దీంతో ఆర్సీబీ మరో విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంటుందని భావించారంతా. కానీ, కోహ్లీ రూపంలో చెన్నైకి తొలి వికెట్ అందించాడు కరన్. తర్వాత ఏ దశలోనూ లక్ష్యాన్ని ఛేదించేలా కనిపించలేదు బెంగళూరు. ధాటిగా ఆడే క్రమంలో వరుసగా వికెట్లను కోల్పోయింది.
ఇదీ చదవండి: 'సంజూ కెప్టెన్గా ఉండడం వారికి ఇష్టం లేదు!'
జడేజా ఆల్రౌండ్ షో..
తొలుత చెన్నై భారీ స్కోరు చేసిందంటే దానికి కారణం జడేజా విధ్వంసమే. హర్షల్ పటేల్ వేసిన చివరి ఓవర్లో 5 సిక్సర్లతో పాటు ఒక ఫోర్ సాధించిన అతడు ఏకంగా 37 పరుగులు పిండుకున్నాడు. అనంతరం బంతితోనూ రాణించాడు జడ్డూ. 4 ఓవర్లలో కేవలం 13 పరుగులే ఇచ్చి కీలకమైన 3 వికెట్లు తీశాడు. మొత్తానికి ఆల్రౌండ్ ప్రదర్శనతో బెంగళూరుకు ఈ సీజన్లో తొలి ఓటమిని రుచి చూపించడంలో ప్రముఖ పాత్ర పోషించాడు.
ఇదీ చదవండి: జడేజా విధ్వంసం.. బెంగళూరు లక్ష్యం 192