క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రారంభానికి రంగం సిద్ధమైంది. ఈ లీగ్‌లో విధ్వంసకర ఇన్నింగ్స్‌లు ఆడేందుకు ఆత్రుతగా ఉన్నారు బ్యాట్స్‌మెన్. దానికి తగ్గట్లు ప్రతి టీమ్‌లోనూ బిగ్ హిట్టర్స్ ఉన్నారు. బంతిని బౌండరీ దాటించడంలో వీరు ముందుంటారు. గేల్, డివిలియర్స్, ధోనీ, రోహిత్, కోహ్లీ వంటి స్టార్ బ్యాట్స్‌మెన్ సిక్సులు బాదితే చూడాలని ప్రతి అభిమాని కోరుకుంటాడు. అలాగే వారు ఆడే కవర్ డ్రైవ్, పుల్ షాట్, అప్పర్ కట్, స్వీప్ షాట్ కోసం ఎదురుచూస్తుంటారు. నేడు ఈ మెగా లీగ్ ప్రారంభమవబోతున్న నేపథ్యంలో ఈ టోర్నీలో ఇప్పటివరకు ఎక్కువ సిక్సులు, ఫోర్లు బాదిన క్రికెటర్లు ఎవరో చూద్దాం.
అత్యధిక సిక్సుర్లు బాదిన క్రికెటర్లు..
క్రిస్ గేల్
![most sixes and fours in IPL to](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11338581_1.jpg)
ఐపీఎల్‌లోనే కాదు పరిమిత ఓవర్ల క్రికెట్లో అత్యంత విధ్వంసకర బ్యాట్స్‌మన్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు క్రిస్ గేల్. ఇతడు బ్యాటింగ్‌కు వస్తే సింగిల్స్, డబుల్స్ తీయడం ఉండదు.. బంతి బౌండరీ దాటాల్సిందే, స్కోర్ బోర్డు పరుగులు పెట్టాల్సిందే. ఇతడి గణాంకాలు చూస్తే మీకే అర్థమవుతుంది. ఇప్పటివరకు లీగ్‌లో 131 ఇన్నింగ్స్‌లు ఆడిన గేల్ 349 సిక్సులతో అందరికంటే ముందున్నాడు. ఇతడు ఇప్పటివరకు లీగ్‌లో 150 స్ట్రైక్ రేట్‌తో 4772 పరుగులు సాధించాడు. ఇందులో 6 సెంచరీలు, 31 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ప్రస్తుతం ఇతడు పంజాబ్ కింగ్స్‌కు ఆడుతున్నాడు.
డివిలియర్స్
![most sixes and fours in IPL to](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11338581_2.jpg)
మైదానం నలువైపులా బంతిని బాదుతూ మిస్టర్ 360గా పేరు తెచ్చుకున్నాడు దక్షిణాఫ్రికా స్టార్ క్రికెటర్ ఏబీ డివిలియర్స్. ఇప్పటివరకు ఐపీఎల్లో 156 ఇన్నింగ్స్‌ల్లో 235 సిక్సులు బాదాడు. అలాగే 151.91 స్ట్రైక్ రేట్‌తో 4349 పరుగులూ సాధించాడీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటింగ్ లెజెండ్. ఇందులో 3 శతకాలు, 38 అర్ధశతకాలూ ఉన్నాయి.
ధోనీ
![most sixes and fours in IPL to](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11338581_3.jpg)
ఐపీఎల్లో అత్యధిక సిక్సులు సాధించిన బ్యాట్స్‌మెన్ జాబితాలో మూడో స్థానంలో నిలిచాడు చెన్నై సూపర్ కింగ్స్ సారథి ఎంఎస్ ధోనీ. మొత్తంగా 182 ఇన్నింగ్స్‌ల్లో 216 సిక్సులు బాదాడు. 313 ఫోర్లూ సాధించాడు. అలాగే 136.75 స్ట్రైక్ రేట్‌తో 4632 పరుగులు చేశాడు. ఇందులో 23 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
రోహిత్ శర్మ
![most sixes and fours in IPL to](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11338581_4.jpg)
ముంబయి ఇండియన్స్‌ను ఐదు సార్లు విజేతగా నిలిపాడు రోహిత్ శర్మ. లీగ్‌లో అత్యధిక సిక్సులు బాదిన ఆటగాళ్ల జాబితాలో నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇతడు 195 ఇన్నింగ్స్‌ల్లో 213 సిక్సులు సాధించాడు. 458 ఫోర్లూ బాదాడు. అలాగే 130.31 స్ట్రైక్ రేట్‌తో 5230 పరుగులు సాధించాడు.
విరాట్ కోహ్లీ
![most sixes and fours in IPL to](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11338581_5.jpg)
ఐపీఎల్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా కొనసాగుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సారథి విరాట్ కోహ్లీ 184 ఇన్నింగ్స్‌ల్లో 201 సిక్సులు బాదాడు. 503 ఫోర్లూ సాధించాడు. మొత్తంగా లీగ్‌లో 130.72 స్ట్రైక్ రేట్‌తో 5878 పరుగులు చేశాడు. ఇందులో 5 సెంచరీలు, 39 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
అత్యధిక ఫోర్లు సాధించిన వీరులు..
శిఖర్ ధావన్
![most sixes and fours in IPL to](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11338581_6.jpg)
ఐపీఎల్లో అత్యధిక ఫోర్లు సాధించిన ఆటగాళ్ల జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు శిఖర్ ధావన్. ఇతడు ఇప్పటివరకు 591 ఫోర్లు బాదాడు. అలాగే 5197 రన్స్ సాధించాడీ దిల్లీ క్యాపిటల్స్ బ్యాట్స్‌మన్. ఇతడి ఖాతాలో 108 సిక్సులూ ఉన్నాయి. గతేడాది రెండు సెంచరీలతో సత్తాచాటాడు.
డేవిడ్ వార్నర్
![most sixes and fours in IPL to](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11338581_7.jpg)
అత్యధిక ఫోర్లు సాధించిన బ్యాట్స్‌మెన్ జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు సన్‌రైజర్స్ హైదరాబాద్ సారథి డేవిడ్ వార్నర్. ఇతడి ఖాతాలో 510 పోర్లు ఉన్నాయి. అలాగే 142 ఇన్నింగ్స్‌ల్లో 5254 పరుగులు సాధించాడు. లీగ్‌లో నాలుగు సెంచరీలతో పాటు 195 సిక్సులూ బాదాడు.
విరాట్ కోహ్లీ
![most sixes and fours in IPL to](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11338581_5.jpg)
ఐపీఎల్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో టాప్‌లో ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సారథి విరాట్ కోహ్లీ.. ఫోర్స్ జాబితాలో మూడో స్థానంలో నిలిచాడు. ఇతడు లీగ్‌లో 503 ఫోర్లతో పాటు 201 సిక్సులూ బాదాడు.
సురేశ్ రైనా
![most sixes and fours in IPL to](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11338581_8.jpg)
చెన్నై సూపర్ కింగ్స్ ప్రధాన ఆటగాడిగా కొనసాగుతున్న సురేశ్ రైనా లీగ్‌లో 493 ఫోర్లు బాదాడు. అలాగే ఇతడి ఖాతాలో 195 సిక్సులు ఉన్నాయి. లీగ్‌లో ఇప్పటివరకు 1 సెంచరీతో పాటు 38 హాఫ్ సెంచరీలు సాధించాడు. అలాగే 193 మ్యాచ్‌ల్లో 5368 పరుగులు చేశాడు.
గౌతమ్ గంభీర్
కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టును 2012, 14లో విజేతగా నిలిపాడు టీమ్ఇండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్. లీగ్‌కు ఎప్పుడో దూరమైనా అత్యధిక ఫోర్లు సాధించిన బ్యాట్స్‌మెన్ జాబితాలో ఐదో స్థానంలో ఇప్పటికీ కొనసాగుతున్నాడు. ఇతడు 152 ఇన్నింగ్స్‌ల్లో 491 ఫోర్లు బాదాడు. అలాగే 4217 పరుగులు సాధించాడు. ఇందులో 36 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
ఇదీ చూడండి: ఐపీఎల్లో అత్యధిక క్యాచ్‌ల ఆటగాళ్లు వీరే