ఐపీఎల్(IPL 2021 News) రసవత్తరంగా సాగుతోంది. చాలా కాలం తర్వాత అభిమానులు వారి అభిమాన ఆటగాళ్ల ఆటను చూసి ఆనందిస్తున్నారు. ఇప్పటికే ముగిసిన ముంబయి-చెన్నై(mi vs csk 2021), బెంగళూరు-కోల్‌కతా(rcb vs kkr 2021) మ్యాచ్‌లు ఫ్యాన్స్‌కు మంచి మజానిచ్చాయి. ఇదే జోరును కొనసాగిస్తూ నేడు దిల్లీ క్యాపిటల్స్-సన్‌రైజర్స్ హైదరాబాద్(dc vs srh 2021) మధ్య పోరు జరగనుంది. వరుస ఓటములతో ఇప్పటికే పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచిన సన్‌రైజర్స్.. 12 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్న దిల్లీపై ఎలా ఆడుతుందో చూడాలంటే మరికొన్ని గంటలు ఆగాల్సిందే. ఈ మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు ప్రత్యక్ష ప్రసారం కానుంది.
దిల్లీకి ఎదురుందా?
విధ్వంసకర బ్యాట్స్‌మెన్‌తో దిల్లీ(delhi capitals team 2021)కి బలమైన బ్యాటింగ్ లైనప్ ఉంది. టీ20 ప్రపంచకప్‌లో చోటు దక్కించుకోని సీనియర్ బ్యాట్స్‌మన్ శిఖర్ ధావన్ వారి ఎంపిక తప్పని నిరూపించాలని భావిస్తున్నాడు. ఇప్పటికే లీగ్‌లో 380 పరుగులతో టాప్ స్కోరర్‌గా కొనసాగుతోన్న గబ్బర్ రెండో విడతలోనూ బ్యాట్‌కు పనిచెప్పాలని చూస్తున్నాడు. ఇతడికి తోడు యువ ఓపెనర్ పృథ్వీ షా కూడా మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఇప్పటివరకు వీరిద్దరు జట్టుకు మంచి శుభారంభాల్ని ఇచ్చారు. వీరి తర్వాత ఇటీవలే గాయం నుంచి కోలుకుని వచ్చిన శ్రేయస్ అయ్యర్‌తో పాటు కెప్టెన్ పంత్, స్టీవ్ స్మిత్, మార్కస్ స్టోయినిస్, హెట్మెయర్లతో మిడిలార్డర్ కూడా బలంగా కనిపిస్తోంది. బౌలింగ్ విభాగంలోనూ పటిష్టంగా ఉంది దిల్లీ. యువ పేసర్ ఆవేశ్ ఖాన్ ఇప్పటికే 14 వికెట్లతో దుమ్మురేపుతున్నాడు. ఇతడికి తోడు రబాడ, రవి అశ్విన్, అమిత్ మిశ్రా, అక్షర్ పటేల్ వంటి అనుభవజ్ఞులు ఉండనే ఉన్నారు.
సన్‌రైజర్స్ ఈసారైనా..!
సన్‌రైజర్స్ విషయానికి వస్తే ఈ సీజన్లో ఒకే ఒక్క విజయంతో పాయింట్ల పట్టికలో చివరిస్థానంలో నిలిచింది. ఆ ఫలితాల్ని మరిచిపోయి రెండో విడతలో ఆత్మవిశ్వాసంతో బరిలో దిగాలని భావిస్తోంది. మొదటి విడతలో జట్టులో టాప్ స్కోరర్‌గా నిలిచిన బెయిర్‌స్టో.. సెకండ్ ఫేజ్ నుంచి వ్యక్తిగత కారణాల వల్ల తప్పుకొన్నాడు. దీంతో బ్యాటింగ్ విభాగాన్ని సీనియర్ బ్యాట్స్‌మెన్ డేవిడ్ వార్నర్ తన భుజానికెత్తుకోవాల్సి అవసరం ఉంది. విలియమ్సన్, మనీష్ పాండే, సాహా, కేదార్ జాదవ్, అబ్దుల్ సమద్, విజయ్ శంకర్ కూడా తమ బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంది. బౌలింగ్ విషయానికి వస్తే స్పిన్ మాంత్రికుడు రషీద్ ఖాన్‌కు తోడు స్వింగ్ కింగ్ భువనేశ్వర్ కుమార్, యార్కర్ స్పెషలిస్ట్ నటరాజన్ సత్తాచాటాలని చూస్తున్నారు.
ఫేస్ టూ ఫేస్
ఐపీఎల్లో ఇప్పటివరకు ఇరుజట్లు 19 మ్యాచ్‌ల్లో తలపడగా దిల్లీ 8, సన్‌రైజర్స్ 11 మ్యాచ్‌ల్లో గెలుపొందాయి.
జట్లు (అంచనా)
దిల్లీ క్యాపిటల్స్
పృథ్వీ షా, శిఖర్ ధావన్, శ్రేయస్ అయ్యర్, స్టీవ్ స్మిత్/హెట్మెయర్, పంత్ (కెప్టెన్), స్టోయినిస్, రవి అశ్విన్, అక్షర్ పటేల్, రబాడ, ఎన్రిచో నోర్ట్జే, ఆవేశ్ ఖాన్
సన్‌రైజర్స్ హైదరాబాద్
వార్నర్, విలియమ్సన్ (కెప్టెన్), సాహా, మనీశ్ పాండే, విజయ్ శంకర్, నబీ/ రూథర్‌ఫోర్డ్/హోల్డర్, అబ్దుల్ సమద్, రషీద్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, సందీప్ శర్మ, ఖలీల్ అహ్మద్