IPL 2023 GT VS CSK : సొంతగడ్డపై చెన్నై సూపర్‌కింగ్స్ అదరగొట్టింది. చెన్నై వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ ఆధిపత్యాన్ని ప్రదర్శించిన ధోని సేన.. మంగళవారం జరిగిన క్వాలిఫయర్-1లో 15 పరుగుల తేడాతో గుజరాత్ టైటాన్స్ జట్టును ఓడించి ఫైనల్‌కు దూసుకెళ్లింది. రుతురాజ్ గైక్వాడ్, కాన్వే రాణించడం వల్ల మొదట చెన్నై 7 వికెట్లకు 172 పరుగులను మాత్రమే స్కోర్ చేసింది. ప్రత్యర్థి టీమ్‌లోని బౌలర్లైన షమి , మోహిత్ శర్మ, నూర్ అహ్మద్.. సూపర్‌కింగ్స్ జట్టుకు కళ్లెం వేశారు. అయితే జడేజా , తీక్షణ , దీపక్ చాహర్ సూపర్‌గా బౌలింగ్ చేయడం వల్ల ఛేదనలో టైటాన్స్ టీమ్.. 20 ఓవర్లలో 157 పరుగులకే ఆలౌటైంది. అయితే ఈ మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మరోవైపు రషీద్ ఖాన్ కూడా మైదానంలో రాణించాడు. ఇప్పటి వరకు ఆడిన అన్నీ మ్యాచ్‌లలో పద్నాలుగు ఐపీఎల్‌లలో చెన్నై ఫైనల్‌కు చేరడం ఇది పదోసారి.
మరోవైపు మందకొడి పిచ్‌పై టైటాన్స్‌కు కూడా పరుగుల కోసం కష్టపడక తప్పలేదు. చెన్నై బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడం వల్ల ఏ దశలోనూ ఆధిపత్యాన్ని ప్రదర్శించలేకపోయింది. దీంతో క్రమం తప్పకుండా వికెట్లు పోవడం వల్ల ఆద్యంతమూ వెనుకబడింది. అంతే కాకుండా ఆ జట్టు ఆరంభమే బాగాలేదు. 9 ఓవర్లు ముగిసే సరికి.. 59 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. మూడో ఓవర్లో సాహాను చాహర్ ఔట్ చేయగా.. హార్దిక్ పాండ్యను తీక్షణ.. పెవిలియన్‌కు పంపాడు. కానీ ఫామ్‌ను కొనసాగిస్తూ శుభ్‌మన్ గిల్ నిలకడగా రాణించాడు. అయితే అతడు కొన్ని చక్కని షాట్లు ఆడినా.. ఎదుర్కొన్న తొలి 32 బంతుల్లో చేసింది 32 పరుగులే. మ్యాచ్‌పై చెన్నై మరింతగా పట్టుబిగించిన సందర్భమది. భారీ షాట్లు కొట్టడం కష్టంగా ఉన్న నేపథ్యంలో అయిదు వికెట్లు కోల్పోయిన గుజరాత్‌కు ఛేదన మరింత కష్టంగా మారింది.
ఆఖరి మూడు ఓవర్లలో ఆ జట్టుకు 39 పరుగులు కావాల్సి ఉంది. అయితే 18వ ఓవర్లో చక్కగా బౌలింగ్ చేసిన పతిరన.. కేవలం 4 పరుగులే ఇచ్చి విజయ్ శంకర్‌ను ఔట్ చేశాడు. నల్కాండె రనౌటయ్యాడు కూడా. అయినా రషీద్ క్రీజులో ఉండడం వల్ల చెన్నైకి ముప్పు తొలగలేదు. తుషార్ (19వ ఓవర్) తొలి బంతికి రషీద్ ఫోర్ కొట్టినా.. మూడో బంతికి ఔట్ కావడం వల్ల చెన్నై ఊపిరిపీల్చుకుంది. అతడు 9వ వికెట్‌గా వెనుదిరిగాడు. చివరి ఓవర్లో టైటాన్స్‌కు 27 పరుగులు అవసరమైన స్థితిలో చెన్నై విజయం ఖాయమైంది.