IPL Auction 2022: రాబోయే ఐపీఎల్ మెగా వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ మాజీ సారథి డేవిడ్ వార్నర్ కోసం పోటీ ఉంటుందని మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత ఆకాశ్ చోప్రా అన్నాడు. అయితే.. సారథిగా ఏ జట్టూ అతడిని తీసుకోదని అభిప్రాయపడ్డాడు. వార్నర్ గతేడాది ఐపీఎల్‌లో పేలవ ప్రదర్శన చేయగా.. సన్‌రైజర్స్ యాజమాన్యం తొలుత కెప్టెన్సీ నుంచి.. ఆపై తుది జట్టు నుంచి కూడా పక్కకుపెట్టి ఘోరంగా అవమానించింది. ఈ క్రమంలోనే 2022 సీజన్‌కు సంబంధించిన రిటెన్షన్ ఆటగాళ్ల జాబితాలోనూ వార్నర్ పేరును ప్రస్తావించలేదు. దీంతో అతడు వేలంలో పాల్గొంటాడని స్పష్టంగా తెలుస్తోంది.
అయితే, ఈ ఆస్ట్రేలియన్ ఓపెనర్‌ను కెప్టెన్‌గా తీసుకోడానికి పలు ఫ్రాంఛైజీలు ఆసక్తిగా ఉన్నాయనే భావన క్రికెట్ వర్గాల్లో నెలకొంది. ఈ నేపథ్యంలోనే తాజాగా తన యూట్యూబ్ ఛానల్‌లో మాట్లాడిన చోప్రా 'వార్నర్‌ను కెప్టెన్‌గా తీసుకోడానికి పలు ఫ్రాంఛైజీలు ఆలోచిస్తూ ఉండొచ్చు. కానీ.. నా అభిప్రాయం ప్రకారం ఎవరూ అతడిని సారథిగా ఎంపిక చేసుకోరు. ఇప్పటికే మూడు జట్లు కొత్త సారథిని నియమించుకోవాలని చూస్తున్నా.. అతడిని మాత్రం పరిగణనలోకి తీసుకోరు. అతడు ఈసారి కొత్త జట్టుకు వెళ్లడం ఖాయమే. భారీ ధర కూడా పలుకుతాడు. కానీ, కెప్టెన్సీ పరంగా అవకాశం లేదు. ఎందుకంటే ఐపీఎల్ ఒక కుటుంబం లాంటిది. గతేడాది ఏం జరిగిందో అందరికీ తెలిసిందే. అక్కడ ఆటగాళ్లు, ఫ్రాంఛైజీల మధ్య ఎలాంటి సమస్యలు ఉన్నాయనే విషయంలోనూ అవగాహన ఉంటుంది' అని తన అభిప్రాయాలు వెల్లడించాడు.
కాగా, వార్నర్ గతేడాది ఐపీఎల్‌లో మొత్తం 8 మ్యాచ్‌లు ఆడగా 195 పరుగులే చేశాడు. అందులోనూ దుబాయ్‌లో జరిగిన రెండో దశ సీజన్‌లో పెద్దగా ఆడే అవకాశం రాలేదు. ఈ క్రమంలోనే గత ఆరు సీజన్లలో గతేడాదే వార్నర్ 500 కన్నా తక్కువ పరుగులు చేశాడు. ఇక ఆ టోర్నీ తర్వాత జరిగిన టీ20 ప్రపంచకప్‌లో ఆసీస్ కప్పు సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. అనంతరం ఇటీవల ముగిసిన యాషెస్ సిరీస్‌లోనూ ఆ జట్టు తరఫున అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా నిలిచాడు. ఇలాంటి పరిస్థితుల్లో మెగా వేలంలో అతడు ఏ జట్టుకు ఎంపికవుతాడో చూడాలి. అయితే, ఈ ఆసీస్ బ్యాట్స్‌మన్ వచ్చే సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు కెప్టెన్‌గా నియమితుడయ్యే అవకాశం ఉందని అభిమానులు ఆశిస్తున్నారు.
ఆ ఇద్దరికే..
Harsha Bhogle on IPL 2022: మెగా వేలం నేపథ్యంలో ఇద్దరు యువ క్రికెటర్లకు భారీ ధర పలికే అవకాశం ఉందని కామెంటేటర్ హర్ష బోగ్లే అభిప్రాయపడ్డాడు. వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్, తమిళనాడు యువ ఆటగాడు షారుక్ ఖాన్ భారీ ధరకు అమ్ముడుపోతారని అభిప్రాయపడ్డాడు.
ఇషాన్ ఎడమ చేతివాటం బ్యాటర్, వికెట్ కీపర్, టాప్ ఆర్డర్లో కూడా ఆడగలడు. ఈ కారణంగా యువ ఆటగాడికి ప్రాధాన్యం ఎక్కువ ఉండొచ్చని హర్ష చెప్పుకొచ్చాడు. మరోవైపు షారుక్ ఖాన్ క్రీజులో ఉన్నంతసేపు యూసుఫ్ పఠాన్‌లా ఆడతాడని కొనియాడాడు. ఈ నేపథ్యంలో తమిళనాడు బ్యాటర్‌కు కూడా డిమాండ్ ఉండొచ్చని పేర్కొన్నాడు హర్ష బోగ్లే.
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!
ఇదీ చదవండి: