Rohith sharma ian bishop: ప్రస్తుతం జరుగుతున్న 15వ సీజన్‌లో ముంబయి ఇండియన్స్ వరుసగా ఎనిమిది మ్యాచ్‌లు ఓడిపోయింది. ఈ వైఫల్యాలతో టీ20 లీగ్ చరిత్రలోనే ఎవరూ ఊహించని పేలవ రికార్డును కెప్టెన్ రోహిత్ శర్మ నమోదు చేశాడు. కానీ ఎట్టకేలకు ఆదివారం జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్‌పై గెలిచి జట్టుకు తొలి విజయాన్ని అందించాడు.
అయితే రాజస్థాన్‌కు ముందు లఖ్‌నవూతో జరిగిన మ్యాచ్‌లో ఓటమిపాలైన తర్వాత ఓటముల విషయమై రోహిత్‌తో తాను మాట్లాడినట్లు వెస్టిండీస్ దిగ్గజం ఇయాన్ బిషప్ పేర్కొన్నాడు. ఆ సమయంలో హిట్‌మ్యాన్ తీవ్ర నిరాశ, నిస్పృహలకు గురైనట్లు కనిపించాడని తెలిపాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న బిషప్ ముంబయి జట్టుపై స్పందించాడు.
"ముంబయి వరుస ఓటములపై రోహిత్ పూర్తి నిరాశతో ఉన్నాడనిపించింది. ముంబయి ఎంతో గొప్ప పేరున్న జట్టు. అయితే, ఆ జట్టులో కొన్ని మార్పులు అవసరమని నేను భావిస్తున్నా. టిమ్‌డేవిడ్ లాంటి ఆటగాడిని వాళ్లు తుది జట్టులోకి తీసుకోవాలి. అతడికి ఎందుకు ఎక్కువ అవకాశాలు ఇవ్వలేదో నాకు అర్థంకాలేదు. సూర్యకుమార్ బాగా ఆడుతున్నా టిమ్ కూడా ఉపయోగపడతాడు" అని బిషప్ చెప్పుకొచ్చాడు.
అలాగే ముంబయి బౌలింగ్ యూనిట్ కూడా సరిగ్గా లేదని విండీస్ దిగ్గజం అభిప్రాయపడ్డాడు. కీలక సమయాల్లో ధారాళంగా పరుగులిస్తున్నారని పేర్కొన్నాడు. దీంతో ఈసారి బౌలింగ్ త్రయం కూడా బాగోలేదన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ముంబయి మున్ముందు ఏయే ఆటగాడిని ఆడిస్తుందో చూడాలన్నాడు. అయితే, ఇకపై ఆడే మ్యాచ్‌ల్లో విజయాలు సాధించి గర్వంగా తల ఎత్తుకొని వెళ్లాలని కోరాడు. కాగా, ముంబయి శనివారం జరిగిన మ్యాచ్‌లో గెలిచి సీజన్‌లో తొలి విజయం నమోదు చేసింది. రాజస్థాన్‌పై 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇక ఈ మ్యాచ్ తుది జట్టులో టిమ్ డేవిడ్‌కు (20*) అవకాశం దక్కింది. చివర్లో వచ్చిన అతడు కాస్త బ్యాట్ ఝళిపించి ముంబయి విజయంలో భాగస్వామ్యమయ్యాడు.
ఇదీ చూడండి: అదరగొట్టిన సూర్యకుమార్.. ముంబయి తొలి విజయం