IPL 2022 GT VS LSG: ఐపీఎల్ 15వ సీజన్లో కొత్తగా చేరిన గుజరాత్ జట్టు బోణీ కొట్టింది. వాంఖడే వేదికగా లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ 5 వికెట్ల తేడాతో గెలిచింది. ప్రత్యర్ధి జట్టు నిర్దేశించిన 159 పరుగుల లక్ష్యాన్ని19.4 ఓవర్లలోనే గుజరాత్ జట్టు ఛేదించింది. రాహుల్ తెవాటియా (36 : 23 బంతుల్లో 4×4, 2×6), సదరంగాని (15 : 7 బంతుల్లో 3×4) నాటౌట్‌గా నిలిచారు. మాథ్యూ వేడ్ (30), కెప్టెన్ హార్దిక్ పాండ్య (33), డేవిడ్ మిల్లర్ (30) పర్వాలేదనిపించారు. లఖ్‌నవూ బౌలర్లలో దుష్మంత చమీర రెండు, కృనాల్ పాండ్య, అవేశ్ ఖాన్, దీపక్ హుడా తలో వికెట్ పడగొట్టారు.
159 పరుగుల లక్ష్యంతో దిగిన గుజరాత్ జట్టు ఆదిలోనే తొలి వికెట్ కోల్పోయింది. మొదటి ఓవర్ వేసిన చమీరా బంతికి ఓపెనర్ శుభమన్ గిల్ డకౌటయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన విజయ్‌శంకర్‌ను(4) కూడా చమీరా పెవిలియన్‌కు పంపాడు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన కెప్టెన్ హార్దిక్ పాండ్యను కృనాల్ పాండ్య చక్కటి బంతితో ఔట్ చేశాడు. నిలకడగా ఆడుతున్న మరో ఓపెనర్ మాథ్యూ వేడ్(30).. దీపక్ హుడా బౌలింగ్‌లో ఔటయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన రాహుల్ తెవాటియా, సదరంగాని మ్యాచ్‌ని ముగించారు.
అంతకుముందు, టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌కు ఆదిలోనే భారీ షాక్ తగిలింది. కెప్టెన్ కేఎల్ రాహుల్ తొలి బంతికే డకౌట్‌గా వెనుదిరిగాడు. మహమ్మద్ షమీ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. ఇక మరో ఓపెనర్ డికాక్ కూడా షమీ బంతికే క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన ఎవిన్ (10), మనీష్ పాండే(6) వరుసగా పెవిలియన్ బాట పట్టారు. సగం ఓవర్లు అయ్యేసరికి లఖ్‌నవూ జట్టు నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. తర్వాత వచ్చిన బ్యాటర్లు దీపక్ హుడా(55), ఆయుష్ బదోని(54) అర్ధశతకాలతో కీలక ఇన్నింగ్స్ ఆడి స్కోరు బోర్డును పరుగులెత్తించారు. అయితే వీరిని కూడా గుజరాత్ బౌలర్లు తమ బంతులతో పెవిలియన్‌కు పంపారు. ఇక, ఇన్నింగ్స్ ముగిసే సమయానికి క్రీజులో కృనాల్ పాండ్య(21), చమీరా(1) నాటౌట్‌గా నిలిచారు. గుజరాత్ బౌలర్లలో మహమ్మద్ షమీ 3, వరుణ్ ఆరోన్ 2 వికెట్లు పడగొట్టగా.. రషీద్ ఖాన్ ఒక వికెట్ తీశాడు.
ఇదీ చదవండి: మహిళల ఐపీఎల్ జట్టును కొనేందుకు పంజాబ్ ఆసక్తి!