IPL 2022 CSK VS GT: చివరి ఓవర్ వరకు ఆసక్తికరంగా సాగిన మ్యాచ్‌లో చెన్నైపై గుజరాత్ మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. డేవిడ్ మిల్లర్ (92*) చివరి వరకు క్రీజ్‌లో ఉండి గుజరాత్‌ను గెలిపించడంలో కీలక పాత్ర పోషించాడు. చెన్నై నిర్దేశించిన 170 పరుగుల లక్ష్య ఛేదనలో గుజరాత్ ఏడు వికెట్లను కోల్పోయి విజయం సాధించింది. మిల్లర్‌తో పాటు కెప్టెన్ రషీద్ ఖాన్ (40) వీరోచిత బ్యాటింగ్ చేశాడు. దీంతో గుజరాత్ (10) పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలోనే కొనసాగుతోంది. మరోవైపు చెన్నై ఐదో ఓటమిని తన ఖాతాలో వేసుకుంది. చెన్నై బౌలర్లలో డ్వేన్ బ్రావో 3, తీక్షణ 2.. ముకేశ్, జడేజా చెరో వికెట్ తీశారు.
అంతకుముందు బ్యాటింగ్ చేసిన చెన్నై.. గుజరాత్‌కు 170 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. స్వల్ప వ్యవధిలో వికెట్లు పడటంతో అనుకున్నంత స్కోరును చెన్నై చేయలేకపోయింది. గుజరాత్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో 20 ఓవర్లలో చెన్నై ఐదు వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (73) సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. గైక్వాడ్‌తోపాటు అంబటి రాయుడు (46) రాణించాడు. వీరిద్దరూ కలిసి 92 పరుగులను జోడించారు. అయితే దూకుడుగా ఆడుతున్న వీరిద్దరూ ఔట్ కావడంతో పరుగుల రాక మందగించింది. ఆఖర్లో శివమ్ దూబే (19), రవీంద్ర జడేజా (22*) దూకుడుగా ఆడేశారు. గుజరాత్ బౌలర్లలో అల్జారీ జోసెఫ్ 2, యశ్ దయాల్, షమీ చెరో వికెట్ తీశారు.
ఇవీ చదవండి: సన్‌రైజర్స్ జైత్రయాత్ర.. పంజాబ్‌పై ఘన విజయం