Most Sixes in IPL 2022: బ్యాటర్ల అద్భుత ప్రదర్శన, బౌలర్ల మెరుపు బౌలింగ్, ఫీల్డింగ్ విన్యాసాలతో ఈ ఐపీఎల్ సీజన్ అద్భుతంగా కొనసాగుతోంది. దీంతో అభిమానులు ఎప్పటిలాగే ఈ సారి ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సీజన్ ఓ సరికొత్త రికార్డు సాధించింది.
లీగ్ చరిత్రలో ఒక సీజన్‌లో అత్యధిక సిక్సర్లు నమోదైన రికార్డును ఐపీఎల్ 2022 తన పేరిట లిఖించుకుంది. ఈ సీజన్లో ఇప్పటివరకు 884 సిక్సర్లు నమోదయ్యాయి. అంతకుముందు 2018లో అత్యధికంగా 872 నమోదయ్యాయి. కాబట్టి ఈ సీజన్‌లో మ్యాచ్‌లు మిగిలి ఉన్న నేపథ్యంలో 1000 సిక్సర్ల మార్క్‌ను అధిగమించే అవకాశం ఉందని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. ఇక 784 సిక్సులతో 2019 మూడో స్థానంలో ఉండగా... 2020లో 734 సిక్సులు, 2012లో 731 సిక్సులు నమోదయ్యాయి. మొత్తంగా ఐపీఎల్ చరిత్రలో ఓ సీజన్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన టాప్ 5 జాబితాలో 2022, 2018, 2019, 2020, 2012 ఉన్నాయి.
Longest Six: ఐపీఎల్ 2022లో లాంగెస్ట్ సిక్స్ కొట్టిన ఆటగాడిగా పంజాబ్ కింగ్స్ హిట్టర్ లియామ్ లివింగ్‌స్టోన్ నిలిచాడు. గుజరాత్ పేసర్ మహ్మద్ షమీ బౌలింగ్‌లో 117 మీటర్ల భారీ సిక్స్‌ర్ బాదాడు. అంతకుముందు చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముఖేష్ చౌదరి బౌలింగ్‌లో లివింగ్‌స్టోన్ 108 మీటర్ల సిక్స్ కూడా కొట్టాడు. జూనియర్ డివిల్లియర్స్‌గా పేరున్న డెవాల్డ్ బ్రెవిస్ 112 మీటర్ల భారీ సిక్స్‌ర్ బాది 15వ సీజన్లో రెండో భారీ సిక్స్ కొట్టిన ఆటగాడిగా నిలిచాడు.
ఇదీ చూడండి: ఐపీఎల్ వార్.. మూడు బెర్తులు.. ఐదు టీమ్‌లు..