చెన్నై సూపర్‌కింగ్స్ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావోపై మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత ఆకాశ్ చోప్రా కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ సీజన్లో ఇప్పటివరకు అతడి నుంచి ఛాంపియన్ బౌలింగ్‌ను చూడలేదని అన్నాడు. అందువల్ల బ్రావో స్థానాన్ని హెజిల్వుడ్తో భర్తీ చేయాలని సూచించాడు. షార్జా వేదికగా దిల్లీతో శనివారం తలపడనుంది చెన్నై.
"బ్రావో స్థానంలో హెజిల్‌వుడ్‌ను ఆడిస్తే బాగుంటుంది. దీంతో డెత్ ఓవర్లలో చెన్నై బౌలింగ్ మెరుగుపడే అవకాశముంది. సీజన్లో ఇప్పటివరకు బ్రావో నుంచి ఛాంపియన్ బౌలింగ్ చూడలేదు. ప్రారంభంలోనే గాయం కావడం వల్లే ఇలా అవుతుందేమో బహుశా!" -ఆకాశ్ చోప్రా, మాజీ క్రికెటర్
గత మ్యాచ్‌లో గాయపడ్డ దిల్లీ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్.. చెన్నైతో పోరులో ఆడేది కష్టమేనని ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. అతడు లేకుండా మ్యాచ్ గెలవడం జట్టుకు కష్టమైన విషయమేనని అన్నాడు.
దిల్లీ క్యాపిటల్స్‌లోని బౌలర్లు ఇషాంత్ శర్మ, అమిత్ మిశ్రా.. గాయాలు కావడం వల్లే ఈ సీజన్ మొత్తానికి దూరమయ్యారు. ఇటీవల వికెట్ కీపర్ రిషభ్ పంత్ కూడా తొడ కండరాలు పట్టేయడం వల్ల, అతడికి వారం రోజుల విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు.