ముంబయి ఇండియన్స్‌పై సూపర్‌ఓవర్‌లో యువపేసర్ నవదీప్ సైనీ అద్భుతంగా బౌలింగ్ చేశాడని కొనియాడాడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సారథి విరాట్ కోహ్లీ. ఎంతో ఒత్తిడిలో ఆత్మవిశ్వాసంతో అతడు బంతులు వేశాడని పేర్కొన్నాడు. మైదానం పెద్దది కావడం వల్ల రిస్క్ చేశాడని వివరించాడు.
"సైనీ నుంచి అద్భుత సూపర్ ఓవర్. హార్దిక్, పొలార్డ్‌కు బంతులు వేయడమంటే సాధారణ విషయం కాదు. పెద్ద బౌండరీలు కావడం వల్ల యార్కర్లు వేసేందుకు ఆత్మవిశ్వాసం పెంచుకున్నాడు. ఎందుకంటే అతడికి వేగం ఉంది. వైడ్ యార్కర్లు చక్కగా వేశాడు. కీలకమైన రెండు పాయింట్లు సంపాదించుకునేందుకు కుర్రాళ్లు ఎంతో కష్టపడ్డారు. మ్యాచులో విజయం దోబూచులాడింది. ఏబీ అద్భుతంగా ఆడాడు. వాషింగ్టన్ సుందర్‌తో పవర్‌ప్లేలో బౌలింగ్ చేయించడం ఫలితాలని ఇచ్చింది."
-విరాట్ కోహ్లీ, ఆర్సీబీ సారథి
దుబాయ్ వేదికగా జరిగిన ఈ పోరులో మొదట బెంగళూరు 3 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. ఛేదనలో 39 పరుగులకే ముంబయి కీలకమైన మూడు వికెట్లు చేజార్చుకుని ఇబ్బందుల్లో పడింది. అయితే ఇషాన్ కిషన్ (99; 58 బంతుల్లో 2×4, 9×6), పొలార్డ్ (60*; 24 బంతుల్లో 3×4, 5×6) ఆఖరి వరకు పోరాడి స్కోరును సమం చేశారు.
ఇక సూపర్ ఓవర్లో ముంబయిని సైనీ 7 పరుగులకే పరిమితం చేశాడు. తొలి రెండు బంతుల్లో రెండు సింగిల్స్ ఇచ్చాడు. మూడో బంతికి పరుగులేమీ రాలేదు. నాలుగో బంతిని పొలార్డ్ బౌండరీకి తరలించాడు. ఐదో బంతికి అతడు ఔటవ్వగా ఆరో బంతికి బైస్ రూపంలో ఒక పరుగే వచ్చింది. ఆ తర్వాత బెంగళూరు ఆఖరి బంతికి మ్యాచులో విజయం సాధించింది.