ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) చరిత్రలో అత్యంత స్థిరమైన జట్లలో చెన్నై సూపర్‌కింగ్స్ ఒకటి. ప్రతి సీజన్లో ప్లే ఆఫ్‌కు చేరుకునే ధోనీసేన.. ప్రస్తుత సీజన్లో ఆ స్థాయి ప్రదర్శన చేయలేకపోతోంది. బెంచ్‌లో కొంతమంది విదేశీ ఆటగాళ్లు ఉన్నప్పటికీ.. రిజర్వ్‌లో సరైన భారత క్రికెటర్లు లేకపోవడం వల్లే టోర్నీలో ఎక్కువ పరాజయాలను ఎదుర్కొంటుంది.
ఓపెనర్లలో ఒకడిగా ఉన్న మురళీ విజయ్, మిడిల్ ఆర్డర్లో కేదార్ జాదవ్ వంటి ఆటగాళ్లు అంచనాలకు తగ్గట్టుగా రాణించలేకపోతున్నారు. మరోవైపు సురేశ్ రైనా, హర్భజన్ సింగ్ ప్రస్తుత సీజన్ నుంచి తప్పుకోగా.. వారిద్దరి స్థానంలో ఇతర ఆటాగాళ్లేవరూ ఒప్పందానికి సంతకం చేయలేదు. అయితే ఫ్రాంచైజీకి మిడ్-సీజన్ మార్క్ వద్ద కొంతమంది ఆటగాళ్లను అంతర్గత బదిలీ చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో సీఎస్కే జట్టులోకి వచ్చే అవకాశం ఉన్న ఆ ముగ్గురు భారత క్రికెటర్లను పరిశీలిద్దాం.
అజింక్య రహానె: టీమ్ఇండియాలో అనుభవజ్ఞుడైన రహానె.. ప్రస్తుత సీజన్లో దిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ఎంపికయ్యాడు. ఓపెనర్లుగా పృథ్వీషా, శిఖర్ ధావన్‌లపై యాజమాన్యం ఆసక్తి చూపగా రహానె ప్రస్తుతం బెంచ్‌కు పరిమితమయ్యాడు. ఈ నేపథ్యంలో సురేశ్ రైనా స్థానంలో అతడిని జట్టులో తీసుకునే అవకాశం ఉంది.
రహానె తన ఐపీఎల్ కెరీర్లో ఇప్పటివరకు ఆడిన 140 మ్యాచ్‌ల్లో 32.93 సగటుతో 3820 పరుగులు చేశాడు. అందులో రెండు సెంచరీలు, 27 హాఫ్‌సెంచరీలు ఉన్నాయి.
పార్థివ్ పటేల్: గత రెండు సీజన్లలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులో ఓపెనర్‌గా రాణించాడు పార్థివ్ పటేల్. ఆ జట్టులో ప్రస్తుతం యువ ఆటగాడు దేవదత్ పడిక్కల్ రాకతో పార్థివ్ పటేల్ స్థానానికి గండిపడినట్లైంది. ఆర్సీబీలో బెంచ్‌కే పరిమితమైన ఈ ఆటగాడిని చెన్నై సూపర్‌కింగ్స్ ఓపెనర్ షేన్ వాట్సన్‌తో పాటు బ్యాటింగ్ బరిలో దించడానికి పరిశీలించే అవకాశం ఉంది.
ఐపీఎల్లో ఇప్పటివరకు 139 మ్యాచ్‌లు ఆడిన పార్థివ్ పటేల్.. 120.78 స్ట్రైక్‌రేట్‌తో 2,848 పరుగులు చేశాడు.
విరాట్ సింగ్: దేశవాళీ క్రికెట్లో ఝార్ఘండ్ తరపున ప్రాతినిధ్యం వహించి గుర్తింపు పొందాడు విరాట్ సింగ్. ఈ సీజన్ తర్వాత రూ.1.9 కోట్లతో విరాట్ సింగ్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు సొంతం చేసుకుంది. విజయ్ హజారే ట్రోఫీలో 7 మ్యాచ్‌లు ఆడిన విరాట్ సింగ్ 335 పరుగులు చేశాడు. సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీలో 142.32 స్ట్రైక్‌రేట్‌తో 342 రన్స్ రాబట్టాడు.
ప్రస్తుతం సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్రియమ్ గార్గ్‌ను ఆడించడం వల్ల తుదిజట్టులో విరాట్సింగ్కు అవకాశం రాలేదు. దీంతో చెన్నై సూపర్‌కింగ్స్ తరపున ఆడేందుకు విరాట్ సింగ్‌ను పరిశీలించే అవకాశాలు కనిపిస్తున్నాయి.