అబుదాబి వేదికగా జరిగిన మ్యాచ్‌లో దిల్లీ క్యాపిటల్స్‌పై సన్‌రైజర్స్ హైదరాబాద్ పదిహేను పరుగుల తేడాతో విజయం సాధించింది. 163పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన దిల్లీ ఏడు వికెట్లు కోల్పోయి 147 రన్స్‌కే పరిమితమైంది. సన్‌రైజర్స్ విజయంలో బెయిర్ స్టో(53) అర్ధశతకంతో మెరవగా విలియమ్సన్(41),సారథి వార్నర్(45) కీలక పాత్ర పోషించారు. దీంతో ఈ టోర్నీలో తొలి విజయాన్ని అందుకుంది సన్‌రైజర్స్.
రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన దిల్లీకి ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. తొలి ఓవర్లోనే పృథ్వీ షా(2) ఔటయ్యాడు. అనంతరం ధావన్(34), శ్రేయస్(17) కాసేపు క్రీజులో నిలదొక్కుకున్నారు. ఆ తర్వాత వచ్చిన పంత్ ,హెట్మెయర్, స్టోయినిస్ వరుసగా పెవిలియన్‌కు క్యూ కట్టారు. సన్‌రైజర్స్ బౌలర్లలో రషీద్ ఖాన్(3), భువనేశ్వర్ కుమార్ (2), ఖలీల్ అహ్మద్, నటరాజన్ చెరో వికెట్ తీశారు. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో బోణీ కొట్టింది సన్‌రైజర్స్.
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. ఓపెనర్లు డేవిడ్ వార్నర్(45; 33 బంతుల్లో 3x4, 2x6), జానీ బెయిర్‌స్టో(54; 48 బంతుల్లో 2x4, 1x6) శుభారంభం చేశారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 77 పరుగులు జోడించారు. ఈ క్రమంలోనే అర్ధశతకం దిశగా వెళ్తున్న వార్నర్.. అమిత్ మిశ్రా బౌలింగ్‌లో కీపర్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. అనంతరం వన్‌డౌన్‌లో వచ్చిన మనీష్ పాండే(3) నిరాశపరిచాడు. అతడు కూడా మిశ్రా బౌలింగ్‌లోనే రబాడ చేతికి చిక్కి ఔటయ్యాడు. దీంతో హైదరాబాద్ 92 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది.
తర్వాత వచ్చిన కేన్ విలియ్సమన్(41; 26 బంతుల్లో 5x4) మెరుపు బ్యాటింగ్ చేశాడు. చివర్లో బెయిర్ స్టోతో కలిసి ధాటిగా ఆడటం వల్ల స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. అయితే, రబాడ వేసిన 18వ ఓవర్ ఐదో బంతికి అనూహ్య షాట్ ఆడిన బెయిర్‌స్టో.. నోర్జే చేతికి చిక్కాడు. దీంతో వార్నర్ టీమ్ 144/3తో నిలిచింది. ఆఖర్లో అబ్దుల్ సమద్(12; 7బంతుల్లో 1x4, 1x6) వీలైనన్ని పరుగులు చేశాడు. ఇక ఇన్నింగ్స్ చివరి ఓవర్‌లో విలియమ్సన్ భారీ షాట్ ఆడబోయి బౌండరీ వద్ద అక్షర్ పటేల్ చేతికి చిక్కాడు. ఈ ఓవర్‌లో కేవలం నాలుగు పరుగులే వచ్చాయి. ఫలితంగా హైదరాబాద్ స్కోర్ 162కే పరిమితమైంది. దిల్లీ బౌలర్లలో రబాడ, మిశ్రా చెరో రెండు వికెట్లు తీశారు.