ప్రపంచవ్యాప్తంగా నల్లజాతీయుల కోసం 'బ్లాక్ లైవ్స్ మాటర్ (బీఎల్‌ఎమ్)' ఉద్యమానికి మద్దతు లభిస్తున్నప్పటికీ ఐపీఎల్‌లో దాని ఊసే లేకపోవడం నిరాశ కలిగించిందని వెస్టిండీస్ కెప్టెన్ జేసన్ హోల్డర్ తెలిపాడు. బీఎల్‌ఎమ్ ఉద్యమానికి మద్దతుగా ఒక్క జట్టు ఆటగాళ్లు కూడా మోకాళ్లపై కూర్చుని సంఘీభావం తెలపలేదని అతనన్నాడు. ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాడైన అతను విండీస్ జట్టు తరపున ప్రతిష్ఠాత్మక పీటర్ స్మిత్ అవార్డు స్వీకరణ సందర్భంగా వర్చువల్ కార్యక్రమంలో మాట్లాడాడు.
"నిజంగా చెప్పాలంటే ఐపీఎల్‌లో అసలు బీఎల్‌ఎమ్ అనే మాటే వినిపించట్లేదు. దాన్ని పట్టించుకోకపోవడం నిరాశ కలిగించింది. నల్లజాతీయులపై వివక్షకు వ్యతిరేకంగా అవగాహన పెంపొందించే దిశగా క్రికెట్ వెస్టిండీస్ తన కర్తవ్యాన్ని నిర్వర్తించింది. ఇంగ్లాండ్‌లో విండీస్ మహిళలు ఆడినప్పుడు కూడా బీఎల్‌ఎమ్‌తో కూడిన లోగోలను ధరించి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లారు. ఇది ఎన్నో ఏళ్ల నుంచి నడుస్తున్న చర్చ. దీర్ఘకాల సవాలిది. పయనించాల్సింది చాలా ఉంది. ప్రజలుగా మనమందరం ఒక్కతాటిపైకి వచ్చి ప్రపంచంలోని అసమానతలను నిర్మూలించేందుకు మార్గాలు కనిపెట్టాల్సిన అవసరం ఉంది"
- జేసన్ హోల్డర్, వెస్టిండీస్ క్రికెటర్
అమెరికాలో పోలీసు దుశ్చర్య కారణంగా నల్లజాతీయుడైన జార్జ్ ఫ్లాయిడ్ చనిపోవడం వల్ల ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. ఈ ఏడాది జులైలో ఇంగ్లాండ్‌లో వెస్టిండీస్ టెస్టు సిరీస్ సందర్భంగా మ్యాచ్‌కు ముందు ఆటగాళ్లు మోకాళ్లపై కూర్చుని బీఎల్‌ఎమ్ ఉద్యమానికి మద్దతు తెలిపారు.