అంబటి రాయుడు లేకపోవడం వల్లే ఓటమి పాలవుతున్నామని చెన్నై సారథి ఎంఎస్ ధోనీ అన్నాడు. అతడి గైర్హాజరుతో జట్టు సమతూకం దెబ్బతింటోందని పేర్కొన్నాడు. తర్వాతి మ్యాచ్‌కు అతడు అందుబాటులోకి వస్తే అంతా సర్దుకుంటుందని ధీమా వ్యక్తం చేశాడు. దిల్లీ చేతిలో ఘోర పరాజయం తర్వాత మహీ మాట్లాడాడు.
"అంబటి రాయుడు లేకపోవడం వల్ల చివరి రెండు మ్యాచుల్లో ఓడిపోయాం. బ్యాటింగ్ ఆర్డర్లో సమతూకం రావడం లేదు. ఇది మాకు మంచి మ్యాచ్‌కాదు. తేమ లేనప్పటికీ వికెట్ నెమ్మదించింది. బ్యాటింగ్ విభాగంలో కసి తగ్గడం మమ్మల్ని బాధిస్తోంది. దూకుడైన ఆరంభం లేకపోవడం వల్ల రన్‌రేట్‌తో పాటు ఒత్తిడి పెరుగుతోంది. స్పష్టమైన లక్ష్యం, కూర్పుతో మేం బరిలోకి దిగాలి. తర్వాతి మ్యాచ్‌లో రాయుడు వస్తే జట్టు సమతూకం మెరుగవ్వొచ్చు. అలా జరిగితే ఒక అదనపు బౌలర్‌తో ప్రయోగాలు చేసేందుకూ వీలుంటుంది."
-ధోనీ, సీఎస్కే సారథి
దుబాయ్ వేదికగా జరిగిన మ్యాచులో మొదట బ్యాటింగ్‌కు దిగిన దిల్లీ 3 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. పృథ్వీషా (64; 43 బంతుల్లో 9×4, 1×6), ధావన్ (35; 27 బంతుల్లో 3×4, 1×6), రిషభ్ పంత్ (37*; 25 బంతుల్లో 5×4), శ్రేయస్ అయ్యర్ (26; 22 బంతుల్లో 1×4) అదరగొట్టారు. ఛేదనకు దిగిన చెన్నైకి శుభారంభం దక్కలేదు. ఓపెనర్లిద్దరూ 34 పరుగుల్లోపే ఔటయ్యారు. ధోనీ (15; 12 బంతుల్లో 2×4) కూడా ఆకట్టుకోలేకపోయాడు. డుప్లెసిస్ (43; 35 బంతుల్లో 4×4) ఒక్కడే రాణించాడు. ఫలితంగా మహీసేన 131/7 పరుగులకే పరిమితమైంది.