ఇండియన్ ప్రీమియర్ లీగులో తానెందుకు రాణించడం లేదో ఆసీస్ విధ్వంసకర ఆటగాడు మాక్స్‌వెల్ చెప్పాడు. జాతీయ జట్టుకు ఆడుతున్నప్పుడు తన పాత్రపై పూర్తి స్పష్టత ఉంటుందన్నాడు. అందుకే అంతర్జాతీయ క్రికెట్లో తాను విజయవంతం అవుతున్నానని వెల్లడించాడు. ఇక్కడ మాత్రం అలా లేకపోవడం వల్ల ప్రదర్శనలో తేడా కనిపిస్తుందని చెప్పాడు.
టీ20 లీగుకు ముందు జరిగిన ఇంగ్లాండ్ సిరీసులో మాక్సీ అదరగొట్టాడు. ఓ శతకమూ బాదేశాడు. యూఏఈలో మాత్రం భారీ ఇన్నింగ్స్‌లు ఆడలేకపోతున్నాడు. ఏడు మ్యాచుల్లో 14.50 సగటుతో 58 పరుగులు చేశాడు.
''ఐపీఎల్, అంతర్జాతీయ కెరీర్‌ను పోల్చుకోకూడదు. అంతర్జాతీయ క్రికెట్ ఆడేటప్పుడు నా పాత్రపై పూర్తి స్పష్టత ఉంటుంది. నా ముందు, వెనక ఎవరెవరు బ్యాటింగ్ చేస్తారో తెలుసు. యూఏఈలో మాత్రం నా పాత్ర ప్రతి మ్యాచ్‌కు మారుతుంది. ఇక్కడ ప్రతి పోరుకు ఆటగాళ్లు మారతారు. ఆస్ట్రేలియా తరఫున అలా కాదు. ఎక్కువగా ఒకే జట్టు ఉంటుంది.''
- మాక్స్‌వెల్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఆటగాడు
రెండు నెలల టోర్నీ అయినప్పుడు జట్టును అనేక సార్లు మారుస్తుంటారని మాక్స్‌వెల్ చెప్పాడు. సమతూకం దొరికే వరకు మార్పులు తప్పవని పేర్కొన్నాడు. తమ జట్టుకు ఇప్పుడిప్పుడే సమతూకం వస్తోందని వెల్లడించాడు. ఇప్పటికైతే టాప్ ఆర్డర్‌లో ఆడే అవకాశం లేదన్నాడు. తన ముందున్న నలుగురు బ్యాట్స్‌మెన్‌కు మద్దతుగా స్ట్రైక్ రొటేట్ చేయడమే తన పాత్రగా పేర్కొన్నాడు. యూఏఈ పిచ్‌లు ప్రస్తుతం నెమ్మదిస్తున్నాయని తెలిపాడు. ఆసీస్ తరఫున ఇక్కడ అంతర్జాతీయ క్రికెట్ ఆడిన అనుభవం ఉందని వెల్లడించాడు. గతంతో పోలిస్తే వికెట్లలో అనూహ్య మార్పులు కనిపిస్తున్నాయని తెలిపాడు. చాలా మ్యాచుల్లో పంజాబ్ గెలుపు దగ్గరికొచ్చి ఓడిపోవడం బాధాకరమని చెప్పాడు మాక్స్‌వెల్.