ఆదివారం ముంబయి ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ ఆల్‌రౌండర్ బెన్‌స్టోక్స్ ఓపెనర్‌గా వచ్చి జట్టుకు విజయాన్నందించాడు. కోల్‌కతా నైట్‌రైడర్స్ స్పిన్నర్ సునీల్ నరేన్ ఓపెనర్‌గా రాణించాడని మనకి తెలుసు. కానీ ఈ సీజన్లో అతడు మిడిలార్డర్లోను బ్యాటింగ్‌కు వచ్చాడు. ఇలాంటి కొన్ని ఆసక్తికరమైన నిర్ణయాలతో అభిమానుల్ని ఆశ్చర్యానికి గురిచేశాయి ఫ్రాంచైజీలు. అలా ఈసారి లీగ్‌లో ఫ్యాన్స్‌కు ఆశ్చర్యం కలిగించిన నిర్ణయాలను ఓసారి చూద్దాం.
ఓపెనర్‌గా బెన్‌స్టోక్స్
ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ బెన్‌స్టోక్స్‌కు పవర్ హిట్టర్‌గా పేరుంది. ఇతడు మిడిలార్డర్లో ఉంటే జట్టు బ్యాటింగ్ లైనప్ సమతూకంగా కనిపిస్తుంది. కానీ ఈసారి ఇతడిని లీగ్‌లో ఓపెనర్‌గా బరిలో దించి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశాడు రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ స్టీవ్ స్మిత్. అలా ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో స్టోక్స్ 110 పరుగులే చేయడం వల్ల స్మిత్ నిర్ణయంపై విమర్శలు వచ్చాయి. కానీ ముంబయి ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 60 బంతుల్లోనే 107 పరుగులు చేసి జట్టు భారీ లక్ష్యాన్ని ఛేదించడంలో కీలకపాత్ర పోషించాడు స్టోక్స్.
![Five experiments in 2020 IPL that surprised many](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/post_image_0358a00_2710newsroom_1603780056_35.jpg)
మిడిలార్డర్‌కు నరేన్
ఐపీఎల్లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ఓపెనర్‌గా రాణించాడు సునీల్ నరేన్. స్పెషలిస్టు స్పిన్నర్ అయినా.. తనదైన పవర్ హిట్టింగ్తో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేయగలడు. అయితే ఈ సీజన్లో ఓపెనర్‌గా అనుకున్నంతగా రాణించలేకపోయాడు. దిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి 64 పరుగులు చేసి జట్టుకు విజయాన్నందించాడు. ఆ తర్వాత పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆరో స్థానంలో దిగి విఫలమయ్యాడు.
![Five experiments in 2020 IPL that surprised many](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/image-2020-10-03t235237-1601749549_2710newsroom_1603780056_1016.jpg)
ఐదో స్థానికి మనీశ్ పాండే
టీమ్ఇండియా జట్టులో సరైన అవకాశాలు దొరకని యువ ఆటగాళ్లలో మనీశ్ పాండే ముందుంటాడు. సాధారణంగా ఇతడు మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వస్తాడు. కానీ కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇతడిని ఐదో స్థానంలో దించింది సన్‌రైజర్స్. కానీ అది ఫలితాన్నివ్వలేదు. కేవలం ఆరు పరుగులే చేసి ఔటయ్యాడు. ఈ సీజన్లో అతడు రెండంకెల స్కోర్ సాధించాడు అంటే అది మూడో స్థానంలోనే. ఆ తర్వాత మళ్లీ మూడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన పాండే.. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మంచి ప్రదర్శన చేశాడు.
![Five experiments in 2020 IPL that surprised many](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/thequint_2020-10_696cd1d1-afb0-4df7-bacd-2cdb89e766df_ron_0023_2710newsroom_1603780057_929.jpg)
బ్యాటింగ్ ఆర్డర్లో డివిలియర్స్ కిందకు
కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో డివిలియర్స్‌ను ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు దింపి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేశాడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ. లెగ్ స్పిన్ బౌలింగ్‌లో అతడికి పేలవ రికార్డు ఉండటం వల్లనే ఇలా చేశామని తర్వాత చెప్పుకొచ్చాడు కోహ్లీ. కానీ ఈ మ్యాచ్‌లో కేవలం రెండు పరుగులే చేయడం వల్ల విరాట్ నిర్ణయంపై ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేశారు. కానీ ఆ తర్వాత మళ్లీ రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన ఏబీ.. 55 పరుగులతో నాటౌట్‌గా నిలిచి జట్టుకు విజయాన్నందించాడు.
![Five experiments in 2020 IPL that surprised many](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/ab_de_villiers_2710newsroom_1603780056_551.jpg)
ఓపెనర్‌గా సామ్ కరన్
రైనా తప్పుకోవడం వల్ల ఈ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్‌కు సరైన మిడిలార్డర్ కనిపించడం లేదు. డుప్లెసిస్, వాట్సన్ ఓపెనర్లుగా రావడం వల్ల మిడిల్లో రాణించగల బ్యాట్స్‌మన్ కరవయ్యారు. దీంతో యువ ఆల్‌రౌండర్ సామ్ కరన్‌ను ఓపెనర్‌గా దించి వాట్సన్‌ను మిడిలార్డర్‌కు పంపించాడు ధోనీ. ఓపెనర్‌గా ఆడిన మూడు మ్యాచ్‌ల్లో రెండింటిలో 31, 22 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు కరన్. ఆ తర్వాత ముంబయి ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లోయరార్డర్కు తిరిగొచ్చి అర్ధశతకంతో అదరగొట్టాడు.
![Five experiments in 2020 IPL that surprised many](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/sam_curran_ipl_3_2710newsroom_1603780056_49.jpg)