చెన్నై జట్టుపై విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిన సంజూ శాంసన్, జోఫ్రా ఆర్చర్‌ను ప్రశంసించాడు రాజస్థాన్ రాయల్స్ జట్టు సారథి స్టీవ్ స్మిత్. అద్భుతంగా బ్యాటింగ్ చేశారని కొనియాడాడు. జోఫ్రా మైదానంలో ఆ విధంగా రెచ్చిపోతారని అస్సలు ఊహించలేదన్నాడు.
ఈ జట్టులోని మరో కీలక ఆటగాడు జాస్ బట్లర్.. క్వారంటైన్లో ఉండటం వల్ల ఈ మ్యాచ్‌కు అందుబాటులో లేదు. దీంతో ఓపెనర్‌గా స్మిత్ దిగాల్సి వచ్చింది. కాగా, ఈ విషయమై స్మిత్ మాట్లాడుతూ.. "బట్లర్ టాప్ ఆర్డర్లో బ్యాటింగ్ చేయడానికి బాగా ఇష్టపడతాడు. ఆ స్థానంలో బ్యాటింగ్‌కు దిగి మంచి విజయాలను అందుకున్నాడు. అతడు వచ్చాక ఏ స్థానంలో ఎవరు దిగాలి అనేది జట్టు అవసరానికి అనుగుణంగా ఆలోచిస్తాం. అతడు జట్టులోకి తిరిగి రావడం వల్ల సమస్యేమి లేదు. కానీ తుది జట్టు ఎంపికకు మరిన్ని అవకాశాలు పెరుగుతాయి" అని అన్నాడు.
చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో సంజూ శాంసన్(32 బంతుల్లో 74 పరుగులు) మెరుపు ఇన్నింగ్స్‌కు.. స్టీవ్ స్మిత్(47 బంతుల్లో 69 పరుగులు) తోడవడం వల్ల రాజస్థాన్ భారీ స్కోరు చేసింది. ఈ సీజన్లో 200 పైగా స్కోరు సాధించిన తొలి జట్టుగా నిలిచింది. అయితే శాంసన్ తరువాత వరుసగా వికెట్లు కోల్పోయినా.. చివరి ఓవర్లో ఆర్చర్ సునామీ ఇన్నింగ్స్ వల్ల 20 ఓవర్లలో 7 వికెట్ల కోల్పోయి 216 పరుగులు చేసింది రాజస్థాన్.
ఇదీ చూడండి సచిన్ ప్రశంసలకు పొంగిపోయిన శాంసన్!