ఐపీఎల్లో మంగళవారం జరిగిన క్వాలిఫైయర్-1 లో ముంబయి చేతిలో ఆరు వికెట్ల తేడాతో ఓడింది చెన్నై. సొంతగడ్డపై పరుగులు చేయడంలో సీఎస్కే బ్యాట్స్‌మెన్ తడబడ్డారు. 20 ఓవర్లలో 131 పరుగులు మాత్రమే చేయగలిగారు. ఈ విషయమే మ్యాచ్ ఓటమికి కారణమైందని బ్యాట్స్‌మెన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశాడు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని.
‘బ్యాటింగ్ విషయంలో పిచ్ పరిస్థితులను మేం త్వరగా పసిగట్టి ఉంటే బాగుండేది. ఇక్కడ ఇప్పటికే ఆరు, ఏడు మ్యాచ్‌లు ఆడాం. పిచ్‌ను బాగా అర్థం చేసుకొని ఉండాల్సింది. ఎలా ప్రవర్తిస్తోంది? ట్యాకీగా ఉందా? బాల్ సరిగ్గా బ్యాటుపైకి వస్తుందా? అన్నది మేం తెలుసుకొని బ్యాటింగ్ చేసుంటే బాగుండేది.’ -మహేంద్ర సింగ్ ధోని, చెన్నై కెప్టెన్
గత కొన్ని మ్యాచ్‌ల్లో సీఎస్కే బ్యాట్స్‌మెన్.. బంతిని అంచనా వేయడంలో విఫలమవుతున్నారని తెలిపాడు కెప్టెన్ ధోని.
‘మా జట్టులో అత్యుత్తమ బ్యాట్స్‌మెన్ ఉన్నారు. పలు మ్యాచ్‌ల్లో మేం బాగా బ్యాటింగ్ చేశాం. ఇప్పటివరకు వారిపైనే ఆధారపడుతూ వచ్చాం. అయితే, పరిస్థితులు ఇంకా బాగా అర్థం చేసుకొని ఉండాల్సింది. తర్వాతి మ్యాచ్‌లో బాగా ఆడతామని భావిస్తున్నాం’ -మహేంద్ర సింగ్ ధోని, చెన్నై కెప్టెన్
ఫైనల్‌కు వెళ్లేందుకు ఇంకో అవకాశం ఉండటం ఆనందం కలిగిస్తోందని, ఆ మ్యాచ్‌లో రాణిస్తామని చెప్పుకొచ్చాడు ధోని.