నాలుగో టెస్టులో విజయం సాధించడానికి భారత్ ఇంకా 8 వికెట్ల దూరంలో ఉంది. 27 ఓవర్ల పాటు సాగిన ఈ సెషన్‌లో భారత బౌలర్లు 54 పరుగులిచ్చి రెండు కీలక వికెట్లు తీశారు. వికెట్లు తీయడమే లక్ష్యంగా బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేస్తున్నారు. ఐదో రోజు బ్యాటింగ్ కొనసాగించిన ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్.. రోరీ బర్న్స్ (50), హసిబ్ హమీద్ (62*) అర్థ శతకాలు సాధించారు. అర్ధశతకం బాది జోరు మీదున్న బర్న్స్‌కు శార్థూల్ ఠాకూర్ కళ్లెం వేశాడు. అర్ధ శతకం పూర్తి చేసుకున్న తర్వాతి బంతికే కీపర్ రిషభ్ పంత్ చేతికి చిక్కాడు.
మరో బ్యాట్స్‌మెన్ హమీద్ 55 వ్యక్తిగత పరుగుల వద్ద ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. జడేజా వేసిన 48వ ఓవర్లో భారీ షాట్ ఆడబోయిన హమీద్ సిరాజ్‌కి క్యాచ్ ఇచ్చాడు. సిరాజ్ దాన్ని నేలపాలు చేయడం వల్ల అద్భుత అవకాశం చేజారింది. క్రీజులో కుదురుకోవడానికి ప్రయత్నిస్తున్న డేవిడ్ మలన్ (5) త్వరగానే రన్ ఔటయ్యాడు. జడేజా వేసిన 53వ ఓవర్ మొదటి బంతికి సింగిల్ తీయడానికి ప్రయత్నిస్తూ మలన్ రన్ ఔటయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ (8*) నిలకడగా ఆడుతున్నాడు. తొలి సెషన్ ముగిసే సరికి ఇంగ్లాండ్ 131/2 స్కోరుతో నిలిచింది. ఈ ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ ఇంకా 237 పరుగులు వెనుకబడి ఉంది.