Indonesia Vs Cambodia Cricket Match : వర్షం కారణంగా క్రికెట్ మ్యాచ్‌లు ఆగిపోవడం, రద్దు కావడం సహజం. కొన్ని సందర్భాల్లో వెలుతురు తక్కువగా ఉందని.. బాల్ కనిపించదని మ్యాచ్‌ను ఆపేస్తారు. ఇలాంటి సమయంలో డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో విజేతను ప్రకటిస్తారు. అయితే ఇవేవీ జరగకుండానే ఓ మ్యాచ్ మధ్యలోనే ఆగిపోయింది. విజేతను కూడా ప్రకటించారు. ఆసియా క్రికెట్ జట్లు కంబోడియా, ఇండోనేసియా మధ్య జరిగిన మ్యాచ్‌లో అలాంటి ఆసక్తికర ఘటన జరిగింది. తమ జట్టు బ్యాటర్‌ను ఔట్‌గా ప్రకటించారనే కారణంతో కంబోడియా టీమ్ మైదానం నుంచి వాకౌట్ చేసింది. దీంతో ఇండోనేసియా జట్టును విజేతగా ప్రకటించారు నిర్వాహకులు.
ఇదీ జరిగింది..
7 మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం కంబోడియా జట్టు ఇండోనేసియా పర్యటనకు వచ్చింది. నవంబర్ 20న ఈ సిరీస్‌లో మొదటి మ్యాచ్ జరిగింది. నవంబర్ 22 వరకు ఐదు మ్యాచ్‌లు జరిగాయి. అందులో మూడు మ్యాచ్‌ల్లో ఇండోనేసియా, రెండింట్లో కంబోడియా గెలిచాయి. అయితే గురువారం ఇరు జట్ల మధ్య ఆరో మ్యాచ్ జరిగింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కంబోడియా 11.3 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 77 పరుగులు చేసింది.
ఈ క్రమంలో ఇండోనేసియా బౌలర్ ధనేశ్ కుమార్ శెట్టి ఇన్నింగ్స్ 12 ఓవర్ వేశాడు. ఆ ఓవర్ మూడో బంతిలో కంబోడియా బ్యాటర్ లక్మన్ బట్ (20) బాదిన బంతిని ధర్మకేసుమ క్యాచ్ పట్టాడు. దీంతో అంపైర్ ఔట్‌గా ప్రకటించాడు. అయితే లక్మన్ ఔట్‌ను కంబోడియా ప్లేయర్లు ఒప్పుకోలేదు. ఆ తర్వాత ఔట్ విషయం వివాదాస్పదమైంది. దీంతో కంబోడియా జట్టు మ్యాచ్ కొనసాగించేందుకు అంగీకరించలేదు. ఆ జట్టు ప్లేయర్లు గ్రౌండ్ నుంచి వాకౌట్ చేశారు. దీంతో చేసేదేమి లేక అంపైర్లు ఇండినేసియా జట్టును విజేతగా ప్రకటించారు. దీంతో అదే రోజు జరగాల్సిన మరో మ్యాచ్‌లో కూడా రద్దైంది. ఇండోనేసియా జట్టు 4-2 తేడాతో సిరీస్‌ను సొంతం చేసుకుంది. అయితే ఈ ఘటనపై అధికారికంగా ఏ జట్టూ స్పందించలేదు.
వరల్డ్ కప్ ట్రోఫీకి అవమానం- మిచెల్ మార్ష్‌పై కేసు నమోదు- జీవితకాల నిషేధం!
మహిళల ప్రీమియర్ లీగ్‌కు బీసీసీఐ సన్నాహాలు- WPL 2024 వేలం అప్పుడే!