వాయిదా పడిన ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ను తిరిగి నిర్వహించడం సవాలుతో కూడుకున్నదని తెలిపారు రాజస్థాన్ రాయల్స్ యజమాని మనోజ్ బదాలే. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల క్రికెట్ క్యాలెండర్ ఇప్పటికే నిర్ణయం కావడం వల్ల.. ఐపీఎల్ నిర్వహణ కష్టమేనని పేర్కొన్నారు.
"ఐపీఎల్‌ను ఎక్కడ, ఎప్పుడు నిర్వహించాలనేదే అతిపెద్ద అంశం. ఇప్పటికే క్రికెటర్లు చాలా క్రికెట్ ఆడారు. వీలైనన్నీ ఎక్కువ మ్యాచ్‌లు ఆడటానికి పలు బోర్డులు ఒప్పందాలు చేసుకున్నాయి. ఎక్కువగా టెస్టు మ్యాచ్‌లు ఆడటానికి ఆసక్తి చూపిస్తున్నాయి."
-మనోజ్ బదాలే, రాజస్థాన్ రాయల్స్ యజమాని.
'అయితే ఐపీఎల్ నిర్వహణకు చాలా తక్కువ అవకాశాలు ఉన్నాయి. యూకే వేదికగా సెప్టెంబర్‌లో టోర్నీ నిర్వహించొచ్చు! టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో అది కూడా చాలా సవాలుతో కూడుకున్నదని చెప్పాలి' అని బదాలే తెలిపారు.
టోర్నీలో కొవిడ్ కేసులు పెరగడం వల్ల ఐపీఎల్ 14వ సీజన్‌ను నిరవధిక వాయిదా వేస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. లీగ్‌లో 7 మ్యాచ్‌లాడిన రాజస్థాన్.. 6 పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచింది.
ఇదిలా ఉండగా.. మిగిలిపోయిన ఐపీఎల్లో తమ ఆటగాళ్లు పాల్గొనేది అనుమానమేనని.. ఇంగ్లాండ్ పురుషుల జట్టు మేనేజింగ్ డైరెక్టర్ యాష్లే గైల్స్ ప్రకటించారు.
ఇదీ చదవండి: 'టీకా షాట్ తీసుకుందాం.. కరోనాను ఔట్ చేద్దాం'