భారత్ వేదికగా ఈ ఏడాది అక్టోబర్-నవంబర్ మధ్య 2023 వన్డే ప్రపంచకప్ జరగనుంది. ఈ మెగా టోర్నీ కోసం జట్టు ఎంపిక గురించి బీసీసీఐ ఇప్పటి నుంచే కసరత్తు మొదలెట్టింది. 20 మంది ఆటగాళ్లతో కూడిన షార్ట్‌లిస్ట్‌ని కూడా సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈ అంశంపై శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కర మాట్లాడాడు. వన్డే ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా కు ప్రధానమైన ఆటగాళ్లెవరో అందరికీ తెలుసని సంగక్కర పేర్కొన్నాడు. ముఖ్య ఆటగాళ్లు తమ దృష్టిని ప్రపంచకప్‌పైనే కేంద్రీకరించాలని, వన్డే క్రికెట్ ఎక్కువగా ఆడాలని సలహా ఇచ్చాడు. వీరంతా ఫిట్‌గా ఉంటూ ఆటలో మరింత మెరుగవ్వాలన్నాడు.
'భారత జట్టులో ప్రధానమైన ఆటగాళ్లెవరో అందరికీ తెలుసు. కాబట్టి.. ఈ ఆటగాళ్ల పనిభార నిర్వహణను చాలా జాగ్రత్తగా చేయాలి. మరికొన్ని రోజుల్లో ఐపీఎల్ ఉంది. ఇతర సిరీస్‌లూ ఉన్నాయి. కానీ, ఇది ప్రపంచకప్ సంవత్సరం కావడంతో ఎక్కువ దృష్టి దానిపైనే ఉండాలి. టీమ్ఇండియా అత్యుత్తమ ఆటగాళ్లు ఎక్కువగా వన్డే క్రికెట్ ఆడాలి. మిగతా వారిని రొటేట్ చేయాలి. కానీ, వరల్డ్ కప్ జట్టులో చోటు సంపాదించుకోవడానికి పోరాడే అవకాశం తమకు కూడా ఉందని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ప్రధాన ఆటగాళ్లు ఫిట్‌నెస్ కాపాడుకుంటూ మరింత నైపుణ్యం సంపాదించాలి. ఇలా చేస్తే భారత్ ప్రపంచ కప్ సాధిస్తుంది. కాబట్టి.. చుట్టూ ఏం జరిగినా వారి ప్రధాన లక్ష్యం ప్రపంచకప్‌గానే ఉండాలి' అని సంగక్కర వివరించాడు.