India vs New Zealand : న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో టీమ్ఇండియా 65 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. టీమ్‌ఇండియా నిర్దేశించిన 192 పరుగుల లక్ష్య ఛేదనలో న్యూజిలాండ్ 18.5 ఓవర్లలో 126 పరుగులకే కుప్పకూలింది. బ్యాటింగ్‌లో ఫామ్ లేమితో బాధపడుతున్న కేన్ విలియమ్సన్ (65) పరుగులు చేసి మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. డెవాన్ కాన్వే (25), గ్లెన్ ఫిలిప్స్(12), డార్లీ మిచెల్(10) పరుగులు చేశారు. భారత బౌలర్లలో దీపక్ హుడా(4), చాహల్, సిరాజ్ 2 చొప్పున, అర్షదీప్, భువీ ఒక్కో వికెట్ పడగొట్టారు.
తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. టీమ్ఇండియా మిస్టర్ 360 ఆటగాడు సూర్య కుమార్ యాదవ్ సూపర్ సెంచరీతో మెరుపు షాట్లు ఆడాడు. ఇషన్ కిషన్ 36 పరుగులతో జట్టుకు అండగా నిలిచాడు. శ్రేయస్ అయ్యర్(13), హార్దిక్ పాండ్య(13) పరుగులు చేసి నిరాశపర్చారు. రిషబ్ పంత్(6) విఫలం కాగా.. దీపక్ హుడా(0), వాషింగ్టన్ సుందర్(0) గోల్డెన్ డక్ ఔట్ అయ్యారు. న్యూజిలాండ్ బౌలర్లు సౌథీ(3), లాకీ ఫెరుగుసన్(2), ఇష్ సోధి(1) వికెట్లు తీశారు. చివరి ఓవర్లో సౌథీ హ్యాట్రిక్ తీయడం గమనార్హం.
సూర్య కుమార్ సూపర్ సెంచరీ..
టీమ్‌ఇండియా స్టార్ బ్యాటర్, మిస్టర్ 360 ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ (111*: 51 బంతుల్లో 11 ఫోర్లు, 7 సిక్స్‌లు) తన టీ20 కెరీర్‌లో రెండో శతకం బాదాడు. న్యూజిలాండ్‌తో రెండో టీ20 మ్యాచ్‌లో వీర విహారం చేశాడు. కేవలం 49 బంతుల్లో శతకాన్ని నమోదు చేశాడు. తొలుత అర్ధశతకం చేయడానికి 32 బంతులను తీసుకొన్న సూర్య.. ఆ తర్వాత సుడిగాలి ఇన్నింగ్స్ ఆడాడు. మరో 17 బంతుల్లోనే సెంచరీ మార్క్‌ను దాటేశాడు. సూర్య ధీటైన ఇన్నింగ్స్‌తో టీమ్‌ఇండియా కివీస్ ముందు 192 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది.
ఇవీ చదవండి : BCCI కొత్త చీఫ్ సెలెక్టర్ ఎవరు?.. రేసులో ఇద్దరు మాజీలు!