జింబాబ్వేతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను భారత్ క్లీన్‌స్వీప్ చేసింది. మూడో వన్డేలో ఆతిథ్య జట్టుపై 13 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో సిరీస్‌ను 3-0తో కైవసం చేసుకుంది. గత రెండు వన్డేల్లో పూర్తిగా విఫలమైన జింబాబ్వే.. తాజా మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో కాస్త ఫర్వాలేదనిపించింది.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కేఎల్ రాహుల్.. జింబాబ్వేకు బౌలింగ్ అప్పగించాడు. ధావన్‌తో కలిసి బ్యాటింగ్‌కు దిగిన రాహుల్.. పరుగులు చేసేందుకు చెమటోడ్చాడు. మరో ఎండ్‌లో ధావన్ సైతం ఆచితూచి ఆడటం వల్ల.. ఇన్నింగ్స్ నత్తనడకన సాగింది. అయితే, రాహుల్ ఔట్ అయిన తర్వాత వచ్చిన యువ బ్యాటర్ శుభ్‌మన్ గిల్.. ఈ మ్యాచ్‌లో అదరగొట్టాడు. చక్కటి ఫోర్లతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. ధావన్(40) వెనుదిరిగినా.. ఇషాన్ కిషన్(50)తో కలిసి సాధికారికంగా బ్యాటింగ్ చేసి శతక మోత మోగించాడు. మొత్తంగా 97 బంతుల్లో 130 పరుగులు చేశాడు. ఈ క్రమంలో సచిన్ రికార్డును బద్దలుకొట్టాడు. జింబాబ్వేపై అత్యధిక వ్యక్తిగత పరుగులు చేసిన భారత బ్యాటర్‌గా రికార్డుకెక్కాడు. ఇదివరకు ఈ రికార్డు సచిన్(127 నాటౌట్) పేరిట ఉండేది. అనంతరం వచ్చిన దీపక్ హుడా, శాంసన్, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్ ఆకట్టుకోలేదు. దీంతో చివర్లో భారత్ వరుసగా వికెట్లు కోల్పోయింది. 50 ఓవర్ల తర్వాత 8 వికెట్లు కోల్పోయి 289 పరుగులతో నిలిచింది.
290 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే జట్టు.. తడబడుతూ ఇన్నింగ్స్ ఆరంభించింది. మూడో ఓవర్లోనే తొలి వికెట్ కోల్పోయింది. అయితే, ఆ తర్వాత కాస్త సమయోచితంగా వ్యవహరించిన కైటానో(13), సీన్ విలియమ్స్(45) జోడి.. రెండో వికెట్‌కు 70కి పైగా పరుగులు జోడించింది. ఈ జోడీని అక్షర్ పటేల్ విడదీశాడు. సీన్ విలియమ్స్‌ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. కైటానో, టోనీ, రేగిస్ చకాబ్వా, ర్యాన్ బర్ల్, ల్యూక్ జోంగ్వేలు ఎక్కువ సేపు క్రీజులో నిలవలేదు. అయితే, ఓవైపు సికందర్ రజా(115) ఒంటరి పోరాటం చేశాడు. ఓ దశలో జింబాబ్వేను గెలిపించినంత పనిచేశాడు. కానీ, భారత బౌలర్లు పుంజుకొని ఆ జట్టును కట్టడి చేశారు. భారత బౌలర్లలో ఆవేశ్ ఖాన్ మూడు వికెట్లు తీశాడు. దీపక్ చాహర్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ రెండేసి వికెట్లు తీయగా శార్దూలా ఠాకూర్ ఒక వికెట్ పడగొట్టాడు.