INDIA VS ZIMBABWE ODI: జింబాబ్వేతో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో భారత్ శుభారంభం చేసింది. తొలి వన్డేలో ఆతిథ్య జట్టును చిత్తుగా ఓడించింది. జింబాబ్వే జట్టు నిర్దేశించిన 190 పరుగుల లక్ష్యాన్ని వికెట్ కోల్పోకుండా ఛేదించింది. ఓపెనర్లు శిఖర్ ధావన్ సమయోచిత బ్యాటింగ్‌కు తోడు.. శుభ్‌మన్‌గిల్ సాధికారిక అర్ధశతకం తోడవడం వల్ల భారత్ సునాయాసంగా గెలుపొందింది.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వే పరుగులు చేసేందుకు చెటోడ్చింది. క్రమంగా వికెట్లు కోల్పోయింది. ఏ దశలోనూ కోలుకునేలా కనిపించలేదు. గాయంతో ఇన్నాళ్లూ క్రికెట్‌కు దూరమైన దీపక్ చాహర్.. తన పునరాగమన మ్యాచ్‌లో అద్భుతంగా రాణించాడు. జింబాబ్వే టాప్ ఆర్డర్‌ను బెంబేలెత్తించాడు. ఆ జట్టు టాప్ 3 ప్లేయర్స్‌ను చాహర్.. వెనక్కి పంపించాడు. మంచి లైన్ అండ్ లెంగ్త్‌లో బంతులు సంధిస్తూ బ్యాట్స్‌మన్‌ను తిప్పలు పెట్టాడు. ప్రసిద్ధ్ కృష్ణ, అక్షర్ పటేల్ తలో మూడు వికెట్లు పడగొట్టి రాణించడం వల్ల.. జింబాబ్వే జట్టు పేకమేడలా కూలిపోయింది. అయితే, జింబాబ్వే జట్టుకు బ్రాడ్ ఎవాన్స్, నంగార్వ కాస్త ఊరట కల్పించారు. ఇరువురు కలిసి తొమ్మిదో వికెట్‌కు 70 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. వీరు ఆ మాత్రం పరుగులు చేయకపోతే.. జింబాబ్వే మరింత తక్కువ స్కోరుకే పరిమితమయ్యేది.
ఇక, 190 పరుగుల లక్ష్యాన్ని భారత్ అలవోకగా ఛేదించింది. ఓపెనర్లు శిఖర్ ధావన్, శుభ్‌మన్ గిల్ ప్రత్యర్థి జట్టుకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా పనికానిచ్చేశారు. ఇన్నింగ్స్ ప్రారంభించిన ధావన్.. ఎదుర్కొన్న తొలి రెండు బంతుల్ని బౌండరీకి తరలించాడు. అయితే, ఆ తర్వాత నెమ్మదించాడు. ఇద్దరు బ్యాటర్లు వీలుచిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ.. స్కోరు బోర్డును ముందుకు నడిపించారు. ఈ క్రమంలోనే ఇద్దరూ అర్ధశతకాలు నమోదు చేశారు. ధావన్ 113 బంతుల్లో 81 పరుగులు చేశాడు. అందులో 9 బౌండరీలు ఉన్నాయి. ఆఖర్లో కాస్త వేగం పెంచి ఆడిన శుభ్‌మన్.. 72 బంతుల్లోనే 82 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. గిల్ ఇన్నింగ్స్‌లో ఒక సిక్స్, 10 ఫోర్లు ఉన్నాయి.
రికార్డుల మోత
ఈ విజయంతో భారత్ ఓ అరుదైన రికార్డును నమోదు చేసింది. 2013 నుంచి ఇప్పటివరకు జింబాబ్వేపై వరుసగా 13 మ్యాచ్‌ల్లో భారత్ విజయం సాధించింది. ఓ ప్రత్యర్థిపై అత్యధిక వరుస విజయాలు ఇవే కావడం విశేషం. అంతకుముందు, బంగ్లాదేశ్‌పై (1988-2004 మధ్య) వరుసగా 12, న్యూజిలాండ్‌పై (1986-88) 11 విజయాలు సాధించింది భారత్.
ఇక, పది వికెట్ల తేడాతో గెలుపొందిన మ్యాచుల్లో భారత్‌కు ఇది రెండో అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యం కావడం విశేషం. 1998లో జింబాబ్వేపైనే 197 పరుగులు చేసి విజయం సాధించింది. అప్పుడు కూడా వికెట్ కోల్పోకుండా భారత్ గెలుపొందింది. ఆ తర్వాత భారత్‌కు '10 వికెట్ల విజయాల్లో' ఇదే అత్యధిక స్కోరు. 2016లో 126 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యం నమోదు చేసి సాధించిన విజయం.. మూడో స్థానంలో ఉంది.