India Vs Newzealand World Cup 2023 : ముంబయిలోని వాంఖడే వేదికగా మరికొద్ది సేపట్లో న్యూజిలాండ్‌తో భారత్ తలపడనుంది. వరుస విజయాలతో దూకుడు మీదున్న రోహిత్ సేన ఇక్కడ కూడా తమ సత్తా చాటాలని భావిస్తోంది. ఈ క్రమంలో ఇక్కడి పిచ్ గురించి పలు అంశాలను క్రికెట్ విశ్లేషకులు చర్చిస్తున్నారు. మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన జట్టుకు ఇక్కడ అదనపు అధిక్యం లభిస్తుందని.. గతంలో నమోదైన పలు రికార్డులు దీనికి నిదర్శనం అని అంటున్నారు. వాంఖడే వేదికగా.. ఇప్పటి వరకు 27 వన్డేలు జరగ్గా అందులో తొలుత బ్యాటింగ్ చేసిన జట్టు 14 సార్లు విజయ తీరాలకు చేరుకున్నాయి.
అయితే ఇక్కడ టాస్ గెలవడం అనే సెంటిమెంట్ పెద్దగా ఎఫెక్ట్ చూపించకపోవచ్చట. ఎందుకంటే టాస్ ఓడిన జట్లు కూడా 15 సార్లు విజయం సాధించగా.. టాస్ నెగ్గిన జట్లు 12 సార్లు మాత్రమే గెలుపొందింది. అయితే కెప్టెన్ వ్యూహానికి అనుగుణంగా నిర్ణయం తీసుకోవడానికి టాస్ ఉపయోగపడుతుంది. ప్రస్తుత టోర్నీలో ఇక్కడ తొలుత బ్యాటింగ్ చేసిన వారే మూడు సార్లు గెలిచారు. ఇక అఫ్గాన్‌పై ఆస్ట్రేలియా కూడా ఓటిమి అంచు వరకు వెళ్లినా మ్యాక్స్‌వెల్ మెరుపు ఇన్నింగ్స్‌తో విజయతీరాలకు చేరింది.
ఆ 15 ఓవర్లు ప్రమాదకరం..
ఇక వాంఖడే స్టేడియంలో పేసర్లకు అనుకూలించే అంచనాలు కూడా ఉన్నాయి. ఇక్కడ జరిగిన మ్యాచ్‌ల్లో పేసర్లు 6.60 ఎకానమీతో 47 వికెట్లు సాధించగా.. స్పిన్నర్లు 5.9 ఎకానమీతో 11 వికెట్లను కూల్చారు. ఈ పిచ్‌పై ఫ్లడ్‌లైట్ల వెలుగులో కొత్త బంతితో పేసర్లకు అద్భుతమైన సీమ్, స్వింగ్ లభిస్తోంది. దీంతో లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన జట్టు పవర్ ప్లేలోనే కుప్పకూలిపోతోంది. ఈ టోర్నీలో మొత్తం నాలుగు మ్యాచ్‌ల్లో ఛేజింగ్ చేసిన జట్లు 17 వికెట్లను పవర్ ప్లేలోనే కోల్పోయాయి.
అయితే తొలుత బ్యాటింగ్ చేసిన జట్లు మాత్రం పవర్ ప్లేలో కేవలం 5 వికెట్లనే కోల్పోవడం గమనార్హం. భారత్, న్యూజిలాండ్ వద్ద ప్రపంచ శ్రేణి సీమర్లు ఉండటం వల్ల తొలుత బ్యాటింగ్ ఎవరు చేస్తారన్నది ఇప్పుడు కీలకంగా మారింది. దీనికి భిన్నంగా ఈ సారి పిచ్‌పై గడ్డిని తొలగించారని రిపోర్టులు రావడం గమనార్హం.
సాధారణంగా వాంఖడేలో పరుగుల వరద పారుతుంటుంది. ఇక్కడ తొలుత బ్యాటింగ్ చేసిన జట్టు అత్యధిక స్కోరు 438. ఇక అత్యధిక ఛేజంగ్ 292 పరుగులు మాత్రమే. అది కూడా ఆసీస్‌లాంటి బలమైన జట్టు.. ఆపసోపాలు పడి అఫ్గాన్‌పై చేసింది.