ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్‌కు అర్హత సాధించింది భారత్. బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో చివరి మ్యాచ్ ఫలితం తేలకముందే ఫైనల్ బెర్త్‌ను సొంతం చేసుకుంది టీమ్ఇండియా. ఆస్ట్రేలియాతో ఫైనల్ ఆడేందుకు భారత్‌తో పాటు శ్రీలంక పోటీ పడింది. అయితే, న్యూజిలాండ్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో శ్రీలంక ఓడిపోవడం వల్ల ఫైనల్ ఆశలను చేజార్చుకుంది. జూన్ 7నుంచి జరగబోయే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో ఆస్ట్రేలియాతో తలపడనుంది టీమ్ఇండియా. ఈ మ్యాచ్ లండన్‌లోని ఓవల్ మైదానంలో జరగనుంది.
శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో 285 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్.. 70 ఓవర్లలో లక్ష్యాన్ని పూర్తి చేసి రెండు వికెట్ల తేడాతో విజయం సాధించింది. చివరి బంతి వరకు ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో కేన్ మామ ఎంతో సంయమనంతో బ్యాటింగ్ చేసి తన జట్టును విజయ తీరాలకు చేర్చాడు. దీంతో రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో న్యూజిలాండ్ 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. కివీస్ బ్యాటర్లలో కేన్ విలియమ్సన్ (121*) సెంచరీతో చెలరేగగా.. డారిల్ మిచెల్ (81) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. టామ్ లేథమ్ (24), హెన్రీ నికోల్స్ (20) డేవన్ కాన్వే (5), మిచెల్ బ్రాస్‌వెల్ (10), బ్లండెల్ (3) పరుగులు చేశారు. శ్రీలంక బౌలర్లలో అసిత ఫెర్నాండో 3, జయసూరియ 2.. రజిత, లాహిరు కుమార చెరో వికెట్ పడగొట్టారు. అంతకుముందు శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 355 పరుగులు చేయగా.. కివీస్ దీటుగా స్పందించి 373 పరుగులు చేసి 18 పరుగుల ఆధిక్యం సాధించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో శ్రీలంక 302 పరుగులకు కుప్పకూలింది.
పాయింట్ల పట్టికలో ఇలా..
ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియా అగ్రస్థానంలో ఉంది. ప్రస్తుతం 68.52 శాతంతో ఆస్ట్రేలియా తొలి స్థానంలో ఉండగా.. భారత్ 60.29 శాతంతో రెండో స్థానంలో కొనసాగుతోంది. అయితే వెస్టిండీస్‌పై సిరీస్‌ను గెలిచిన దక్షిణాఫ్రికా 55.56 శాతంతో మూడో స్థానానికి చేరింది. మరోవైపు న్యూజిలాండ్ చేతిలో తొలి టెస్టులో ఓటమిపాలైన శ్రీలంక 48.48 శాతంతో నాలుగో స్థానానికి పడిపోయింది. ఫలితంగా భారత్ - ఆస్ట్రేలియా నాలుగో టెస్టు ఫలితంతో సంబంధం లేకుండా పోయింది. ఈ మ్యాచ్ డ్రాగా ముగిసినా స్థానాల్లో మార్పు ఉండకపోవచ్చు. కానీ, శాతం మారే అవకాశం ఉంది. అంతకుముందు జరిగిన ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయింది భారత్.
ఇవీ చదవండి : నాలుగో టెస్టు డ్రా అయితే.. భారత్ WTC ఫైనల్‌కు చేరుతుందా?
WPL 2023: హర్మన్‌ప్రీత్ ధనాధన్ ఇన్నింగ్స్.. యూపీపై ముంబయి ఘన విజయం