Pink Test: 'గులాబి బంతితో ఆడేందుకు ఆసక్తిగా ఉన్నాం' - INDW Vs AUSW pink test
ఆస్ట్రేలియా, భారత్ మహిళా జట్ల(INDW Vs AUSW Test) మధ్య చారిత్రక గులాబి టెస్టుకు(Pink Test) రంగం సిద్ధమైంది. గురువారం(సెప్టెంబర్ 30) ఉదయం 10 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. భారత మహిళా క్రికెటర్లు తొలిసారి గులాబి బంతితో డేనైట్ టెస్టు ఆడనుండడం ప్రత్యేకం. ఈ మ్యాచ్ కోసం ఇరుజట్లు ఏ విధంగా సన్నద్ధమవుతున్నారో కెప్టెన్ల మాటల్లోనే తెలుసుకుందాం.
భారత మహిళల క్రికెట్లో(Indian Women Cricket Team Match) ఒక ప్రత్యేక అధ్యాయానికి గురువారం నాంది పడనుంది. మన అమ్మాయిలు తొలిసారి గులాబి బంతితో డేనైట్ టెస్టు(Pink Test) ఆడబోతున్నారు. మహిళల క్రికెట్లో టెస్టు మ్యాచ్‌లే అరుదంటే.. గులాబి బంతితో మ్యాచ్ జరగబోతుండటం మరింత ప్రత్యేకం. దాదాపు ఏడేళ్ల విరామం తర్వాత భారత అమ్మాయిలు కొన్ని నెలల కిందటే ఇంగ్లాండ్‌తో టెస్టు మ్యాచ్ ఆడారు. అందులో చక్కటి ప్రదర్శనతో మ్యాచ్‌ను డ్రాగా ముగించారు. ఆస్ట్రేలియాతో(INDW Vs AUSW Test) భారత అమ్మాయిలు 15 ఏళ్ల తర్వాత టెస్టు మ్యాచ్ ఆడనుండటం విశేషం.
చివరగా 2006లో రెండు జట్లు సుదీర్ఘ ఫార్మాట్లో తలపడ్డాయి. అప్పుడు భారత జట్టులో ఉన్న మిథాలీ రాజ్, జులన్ గోస్వామి ఇప్పుడు కూడా టీమ్‌ఇండియాకు ప్రాతినిధ్యం వహిస్తుండటం గమనార్హం. అప్పటితో పోలిస్తే ఆస్ట్రేలియా జట్టు పూర్తిగా మారిపోయింది. సొంతగడ్డపై, అందులోనూ గులాబి బంతితో ఆడబోతుండటం ఆస్ట్రేలియాకు బాగా కలిసొచ్చేదే. ఆ జట్టుకు ఒక డేనైట్ టెస్టు (2017) ఆడిన అనుభవం కూడా ఉంది. పేస్ బౌలర్లతో కళకళలాడుతున్న ఆసీస్.. పచ్చిక పిచ్‌ను, గులాబి బంతిని బాగా ఉపయోగించుకుంటుందనడంలో సందేహం లేదు.
గులాబి టెస్టులో ఆ జట్టు పేసర్లను ఎదుర్కోవడం భారత్‌కు సవాలే. మిథాలీ మినహా బ్యాటర్లకు టెస్టుల్లో పెద్దగా అనుభవం లేకపోవడం ప్రతికూలతే. సీనియర్ ఆల్‌రౌండర్ హర్మన్‌ప్రీత్ గాయం కారణంగా ఈ మ్యాచ్‌కు అందుబాటులో లేదు. బ్యాటింగ్‌లో మిథాలీ, స్మృతి మంధాన, షెఫాలి, పూనమ్ రౌత్‌లపై భారత్ ఎక్కువగా ఆధారపడనుంది. ఆస్ట్రేలియాతో వన్డేల్లో ఆకట్టుకున్న మేఘనా సింగ్, పూజా వస్త్రాకర్.. జులన్‌తో కలిసి పేస్ బాధ్యతలు పంచుకుంటారు. స్పిన్ బాధ్యతలు దీప్తి శర్మ, స్నేహ్ రాణా పంచుకోనున్నారు. గాయం కారణంగా వైస్ కెప్టెన్ రేచెల్ హేన్స్ సేవలు కోల్పోవడం ఆస్ట్రేలియాకు ఎదురు దెబ్బే. అయినప్పటికీ.. బ్యాటింగ్‌లో బెత్‌మూనీ, మెగ్ లానింగ్, గార్డ్‌నర్, హీలీ.. బౌలింగ్‌లో అనాబెల్, పెర్రీ, తహిలా, సోఫీలతో ఆ జట్టు చాలా బలంగా ఉంది.
"భారత్‌తో ఈ మ్యాచ్ ఆడబోతుండడం పట్ల మేమెంతో ఉత్సాహంతో ఉన్నాం. భారత్ గొప్ప క్రికెట్ దేశం. వాళ్లు క్రికెట్‌ను ఎంతో ఇష్టపడతారు. భారత్‌తో మరిన్ని మ్యాచ్‌లు ఆడతామని ఆశిస్తున్నాం. ఈ గులాబి టెస్టు ఎంతో ప్రత్యేకంగా మారుతుందనుకుంటున్నాం. హేన్స్ దూరం కావడం మాకు లోటే. కానీ మాకు ప్రత్యామ్నాయాలు చాలా ఉన్నాయి. పిచ్ పచ్చగా కనిపిస్తోంది. పేస్ ఆల్రౌండర్లకు ప్రాధాన్యం ఉంటుంది. మ్యాచ్ సమయానికి వికెట్ ఎలా ఉందో చూసి తుదిజట్టును ఎంచుకుంటాం".
- మెగ్ లానింగ్, ఆస్ట్రేలియా మహిళల జట్టు కెప్టెన్.
"గులాబి బంతితో డేనైట్ ఆడడం చాలా కొత్త అనుభం. ఆ బంతితో నేను కూడా ఎప్పుడూ మ్యాచ్ ఆడలేదు. సంధ్యా సమయంలో గులాబి బంతిని ఎదుర్కోవడం చాలా కష్టం అంటుంటారు. ఆ సమయంలో బంతిని ఎలా స్పందిస్తుందో చూడాలని ఆసక్తిగా ఉంది. జట్టు ఎంతో ఆత్మవిశ్వాసంతో ఉంది. వన్డే ప్రపంచకప్‌కు ముందు ఉత్తమ జట్టుతో తలపడడం మేలు చేస్తుంది. టెస్టులు తరచుగా ఆడించేట్లయితే దేశవాళీల్లోనూ ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌ల సంఖ్య పెంచాలి".
- మిథాలీ రాజ్, భారత మహిళల జట్టు కెప్టెన్.
- భారత మహిళల జట్టుకు ఇదే తొలి డేనైట్ టెస్టు
- మహిళల క్రికెట్లో ఇది రెండో డేనైట్ టెస్టు. తొలిసారి 2017లో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ తలపడ్డాయి.
ఇదీ చూడండి.. INDW vs AUSW: చారిత్రక డేనైట్ టెస్టుకు రంగం సిద్ధం