IND vs WI 3rd T20: వెస్టిండీస్‌పై రెండో టీ20లో కూడా విజయం సాధించి సిరీస్ సొంతం చేసుకున్న టీమ్ఇండియా ఆదివారం, మూడో టీ20కి సిద్ధమైంది. ఈ మ్యాచ్‌లో కూడా విండీస్‌ను చిత్తు చేసి వైట్‌వాష్ చేయాలని భారత్ భావిస్తోంది. ఇప్పటికే వన్డేల్లో ఘోర పరాజయం ఎదుర్కొని విండీస్ వైట్‌వాష్‌కు గురైంది. ఈ నేపథ్యంలో మూడో టీ20లోనైనా విండీస్ గెలుపు తలుపు తడుతుందా లేక భారత్ తన ఆధిపత్యం కొనసాగిస్తుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
కొత్త వాళ్లకు ఛాన్స్..
మూడో టీ20లో విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్‌ల గైర్హాజరు నేపథ్యంలో కొత్త వాళ్లకు అవకాశం లభించొచ్చు. ఇప్పటికే అవకాశం కోసం ఎదురుచూస్తున్న యువ క్రికెటర్లు శ్రేయశ్ అయ్యర్, రుతురాజ్ గైక్వాడ్‌లకు ఈ టీ20తో జట్టులో ఛాన్స్ వచ్చే అవకాశం ఉంది. ఈ జాబితాలోనే దీపక్ హుడా కూడా ఉన్నాడు.
తొలి రెండు టీ20ల్లో ఇషాన్ కిషన్ బ్యాటింగ్‌లో తడబాటు ఉండటం వల్ల మూడో మ్యాచ్‌లో రోహిత్.. మరోసారి కిషన్‌కు అవకాశం ఇస్తాడా లేక రుతురాజ్‌ను బరిలోకి దింపుతాడా అనే విషయంపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.
మరోవైపు బౌలర్లు భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్ తొలి రెండు మ్యాచ్‌లలో అద్భుతంగా రాణించారు. అయితే టీ20 ప్రపంచకప్ దగ్గర పడుతున్న నేపథ్యంలో కొత్త కూర్పుతో ప్రయోగం చేసేందుకు రోహిత్ ప్రాధాన్యం ఇచ్చే ఆస్కారం ఉంది. మూడో టీ20లో భూవీ, హర్షల్ స్థానాల్లో సిరాజ్, ఆవేశ్ ఖాన్లు వచ్చే అవకాశం ఉంది.
చివరి మ్యాచ్‌లోనైనా..
భారత్ పర్యటనలో విండీస్ ఇప్పటివరకు గెలుపు రుచి చూడలేదు. స్థాయి తగ్గ ప్రదర్శన చేయడంలో విఫలమై వన్డేల్లో ఘోర పరాజయం పొందింది. టీ20 స్పెషలిస్టులుగా పేరున్న ఈ జట్టు.. పొట్టి ఫార్మాట్లోనైనా ఇండియాను ఇబ్బంది పెడుతుంది అనుకుంటే మళ్లీ అదే సీన్ రిపీట్ అయింది. రెండో టీ20లో బ్యాటింగ్‌లో విండీస్ మెరిసినా స్థాయి తగ్గ ప్రదర్శన కనపడలేదు. ఈ నేపథ్యంలో మూడో టీ20లో ఘన విజయం సాధించి గౌరవప్రదంగా పర్యటనను ముగించాలని కరీబియన్ జట్టు భావిస్తోంది.
ఇదీ చూడండి : అంజలితో సచిన్ పెళ్లి.. ఎవరు ఒప్పించారంటే?