IND vs SA Test: సెంచూరియన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్లో 327 పరుగులకు ఆలౌటైంది టీమ్ఇండియా. సెంచరీ వీరుడు రాహుల్ మరో పరుగు చేసి (123) రబాడ చేతికి చిక్కాడు. రహానే కూడా 48 పరుగులు చేసి వెనుదిరగడం వల్ల టీమ్ఇండియా ఇన్నింగ్స్ గాడితప్పింది.
టపటపా..
ఆ తర్వాత వచ్చిన వారంతా పెవిలియన్కు క్యూ కట్టారు. పంత్ (8), అశ్విన్ (4), శార్దూల్ ఠాకూర్ (4) విఫలమయ్యారు. దీంతో తొలిరోజు 272 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయిన బారత్.. మూడో రోజు ఆట ప్రారంభమైన కాసేపటికే మరో 36 పరుగులు జోడించి ఆరు వికెట్లు చేజార్చుకుంది. చివర్లో బుమ్రా (14), సిరాజ్ (4) కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు.
తొలి రోజు దక్షిణాఫ్రికాపై పూర్తి ఆధిపత్యం వహించింది టీమ్ఇండియా. రాహుల్ సెంచరీకి, మయాంక్ అగర్వాల్(60) ధనాధన్ ఇన్నింగ్స్ తోడవ్వడం వల్ల ఆటముగిసే సమయానికి టీమ్ఇండియా భారీ స్కోరు చేసింది. మూడు వికెట్లు కోల్పోయి 272 పరుగులు చేసింది. రెండో రోజు వర్షం కారణంగా ఆట రద్దయింది.
దక్షిణాఫ్రికా బౌలర్లలో ఎంగిడి ఆరు వికెట్లతో భారత బ్యాటర్లను ముప్పతిప్పలు పెట్టాడు. రబాడ 3 వికెట్లు దక్కించుకున్నాడు.