IND vs SA Test: కేప్‌టౌన్ వేదికగా భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య కీలకమైన మూడో టెస్టు మంగళవారం ప్రారంభం కానుంది. చెరో విజయంతో సిరీస్‌ను సమం చేసిన ఇరు జట్లు.. నిర్ణయాత్మకమైన ఆఖరి మ్యాచ్‌లో తలపడేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో మూడో టెస్టులో విజయం ఎవరి వైపు మొగ్గు చూపే అవకాశం ఉందనే విషయాలను భారత వెటరన్ కీపర్ దినేశ్ కార్తిక్, దక్షిణాఫ్రికా మాజీ ఆల్‌రౌండర్ షాన్ పొలాక్ విశ్లేషించారు. ఆటగాళ్ల అనుభవం, పిచ్ పరిస్థితులను బట్టి పర్యాటక జట్టుకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఇదే సమయంలో ఆతిథ్య జట్టు పోరాటాన్ని తక్కువగా అంచనా వేయలేమన్నారు. అయితే నిర్ణయాత్మకమైన పోరు రసవత్తరంగా ఉంటుందని స్పష్టం చేశారు.
"రెండు జట్లూ చాలా మంచి ఫామ్‌లోనే ఉన్నాయి. అయితే మూడో టెస్టులో విజయం సాధించేందుకు భారత్‌కే ఎక్కువ అవకాశాలు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాలు చాలా పటిష్ఠంగా ఉన్నాయి. దక్షిణాఫ్రికా పిచ్‌ల మీద 400 పరుగులు కొట్టగలిగే సామర్థ్యం భారత్‌కు ఉంది. అయితే సిరాజ్ గాయపడటం కాస్త ఇబ్బందే. ఆఖరి మ్యాచ్ నాటికి అతడు ఫిట్‌నెస్ సాధించాలని టీమ్‌ఇండియా కోరుకుంటుంది. సిరాజ్ లేకపోయినా.. ఇషాంత్, ఉమేశ్ యాదవ్‌లో ఒకరు జట్టులోకి వస్తారు. అంటే ఆరుగురు బ్యాటర్లు.. ఐదుగురు బౌలర్ల కాంబినేషన్‌తోనే టీమ్‌ఇండియా బరిలోకి దిగుతుందని భావిస్తున్నా."
-దినేష్ కార్తిక్, టీమ్ఇండియా వెటరన్ క్రికెటర్
షాన్ పొలాక్ కూడా భారత్‌కే అవకాశాలు ఉన్నాయని చెప్పాడు. "పరిస్థితులే గెలుపును నిర్దేశిస్తాయి. కేప్‌టౌన్‌లో విభిన్నమైన పిచ్‌లను చూశాం. అనుభవం ప్రకారం భారత్‌వైపు కాస్త మొగ్గు ఉంది. వారిలో చాలామంది ఆటగాళ్లు ఇక్కడ (దక్షిణాఫ్రికా) మంచి ప్రదర్శనే ఇచ్చారు. కొంతమంది వ్యక్తిగత ఫామ్‌పై ఏమాత్రం ఆందోళనతో లేరు. అయితే టీమ్‌ఇండియా మైండ్‌సెట్‌ను అర్థం చేసుకోవడంలో దక్షిణాఫ్రికా ఇబ్బందిపడుతోంది. కాబట్టి రెండు టెస్టులను చూసిన తర్వాత మూడో మ్యాచ్‌లో ఎవరు ఫేవరేట్ అంటే మాత్రం భారత్ అని చెప్పొచ్చు" అని పొలాక్ పేర్కొన్నాడు.