IND vs SA: దక్షిణాఫ్రికాతో మూడు టెస్టులు, మూడు వన్డేలు ఆడేందుకు టీమ్‌ఇండియా అక్కడికి వెళ్లింది. ఈ నేపథ్యంలో క్రికెట్ సౌతాఫ్రికా (సీఎస్‌ఏ) బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఒమిక్రాన్ వ్యాప్తి ఎక్కువగా ఉండటంతో ముందస్తు భద్రతాపరమైన చర్యలు చేపట్టింది. అందులో భాగంగా దేశీయంగా నాలుగు రోజులపాటు జరిగే మ్యాచ్‌లను వాయిదా వేస్తున్నట్లు సీఎస్‌ఏ ప్రకటించింది. "డొమిస్టిక్ క్రికెట్‌లో డివిజన్ వన్ (డిసెంబర్ 19-22) ఐదో రౌండ్ మ్యాచ్‌లను వాయిదా వేయాలని నిర్ణయించాం. కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో బయోబబుల్ వెలుపల పోటీలు జరుగుతున్నందున రక్షణ చర్యగా వాయిదా వేయాలని అనుకున్నాం" అని సీఎస్‌ఏ అధికారి వెల్లడించారు. అయితే వాయిదా పడిన మ్యాచ్‌ల షెడ్యూల్‌ను నూతన సంవత్సరంలో ఖరారు చేస్తామని తెలిపారు.
IND vs SA Test 2022:
భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య డిసెంబర్ 26 (బాక్సింగ్ డే) నుంచి తొలి టెస్టు ప్రారంభమవుతుంది. ఇప్పటికే విరాట్ కోహ్లీ నేతృత్వంలోని టెస్టు జట్టు దక్షిణాఫ్రికాలో అడుగు పెట్టింది. టెస్టు సిరీస్ కోసం ఆటగాళ్లు కఠినంగా సాధన చేస్తున్నారు. ఇప్పటి వరకు ఆఫ్రికా గడ్డ మీద ఒక్క సిరీస్‌ను గెలుచుకోని టీమ్‌ఇండియా.. చరిత్ర తిరగరాయాలని భావిస్తోంది. తొలి టెస్టు డిసెంబర్ 26-30, రెండో టెస్టు జనవరి 03-07, ఆఖరి టెస్టు జనవరి 11-15 వరకు జరుగుతుంది. జనవరి 19, 21, 23వ తేదీల్లో మూడు వన్డేలు జరుగుతాయి.
ఇదీ చదవండి: IND VS SA: 'దక్షిణాఫ్రికా టూర్లో టీమ్‌ఇండియా బలం వాళ్లే..'