IND vs SA Series: సఫారీ గడ్డపై తొలిసారి టెస్టు సిరీస్ సొంతం చేసుకోవాలనే పట్టుదలతో ఉన్న టీమ్‌ఇండియా ఆ దిశగా తమ అస్త్రాలకు పదును పెడుతోంది. ఇప్పటికే దక్షిణాఫ్రికా చేరిన కోహ్లీసేన ప్రాక్టీస్‌లో చెమటోడుస్తోంది. ఆదివారం ఆరంభమయ్యే తొలి టెస్టులో గెలిచి మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో శుభారంభం చేయాలనే ధ్యేయంతో కనిపిస్తోంది. అయితే మ్యాచ్ కోసం మైదానంలో అడుగుపెట్టే ముందు టీమ్‌ఇండియా తుది జట్టుపై చర్చ సాగుతోంది.
పేలవ ఫామ్‌లో ఉన్న రహానేకు చివరి అవకాశం కల్పిస్తారా? మయాంక్‌కు తోడుగా ఓపెనింగ్ చేసేదెవరు? తెలుగు ఆటగాడు విహారిని ఈ మ్యాచ్‌లోనైనా ఆడిస్తారా? అనే ప్రశ్నలు రేకెత్తుతున్నాయి. కానీ తొలి మ్యాచ్ కోసం భారత జట్టులో పెద్దగా మార్పులేమీ చేయకపోవచ్చని తెలుస్తోంది. అనుభవం, ఫామ్ ప్రకారం పదకొండు మందిని మైదానంలో దింపుతారని సమాచారం.
గాయాల కారణంగా ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ దక్షిణాఫ్రికా వెళ్లలేదు. దీంతో మయాంక్ ఓ ఓపెనర్‌గా ఆడతాడు. ఇక అతనికి జతగా కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్ ఆరంభించడం ఖాయమే. ఆ తర్వాత బ్యాటింగ్ ఆర్డర్లో కెప్టెన్ కోహ్లీ ఎలాగో ఉంటాడు. కానీ సీనియర్ బ్యాటర్లైన పుజారా, రహానె పేలవ ఫామ్‌లో ఉన్నప్పటికీ అనుభవం దృష్ట్యా చూస్తే వీళ్లకు మరొక అవకాశం దక్కొచ్చు. ముఖ్యంగా రహానేకు ఇది చివరి అవకాశంగా పేర్కొంటున్నారు. విదేశాల్లో మంచి రికార్డు (41.71 సగటుతో 3 వేలకు పైగా పరుగులు) ఉండడం అతనికి కలిసి వచ్చింది. ఆరో స్థానంలో మరోసారి విహారికి నిరాశ తప్పేలా లేదు. కివీస్‌తో అరంగేట్ర టెస్టులో సెంచరీ, అర్ధశతకం చేసిన శ్రేయస్ అయ్యర్ జట్టుతో కొనసాగడం ఖాయం. పంత్ తిరిగి జట్టులోకి వస్తాడు. అశ్విన్ స్పిన్నర్‌గా ఉంటాడు. ఇక బుమ్రా, సిరాజ్, షమీ పేసర్లుగా ఆడతారని తెలుస్తోంది.