ind vs nz test squad: ముంబయిలో జరగనున్న రెండో టెస్టు కోసం తుది జట్టు ఎంపికలో గందరగోళం అవసరం లేదని కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. ఆటగాళ్ల వ్యక్తిగత ప్రయోజనాల కంటే జట్టుకే తొలి ప్రాధాన్యమిస్తామని పేర్కొన్నాడు. జట్టు అవసరాలను బట్టి యాజమాన్యం ఆటగాళ్లను ఎంపిక చేస్తుందని చెప్పాడు.
'సుదీర్ఘంగా సాగే టెస్టుల్లో రాణించాలంటే మంచి ఫామ్‌లో ఉండాలి. ప్రస్తుత పరిస్థితుల్లో వెంటవెంటనే విభిన్న ఫార్మాట్లలో ఆడాల్సి రావడంతో.. టెక్నిక్‌తో పాటు మానసికంగానూ అందుకు సిద్ధంగా ఉండాలి. వీలైనంత త్వరగా పిచ్ పరిస్థితులకు అలవాటు పడాలి. క్రీజులో నిలదొక్కుకోగలిగితే.. ఆటను బాగా అర్థం చేసుకోవచ్చు. గతంలో కూడా మేం తుది జట్టు కూర్పులో చాలా సార్లు మార్పులు చేశాం. జట్టుకు కావాల్సిందేంటో ఆటగాళ్లకు వివరించాం. మా ఆలోచనతో వారు కూడా ఏకీభవించారు. ఒకరిపై ఒకరికి నమ్మకం ఉంటే ఇదేమంత కష్టం కాదు. మా ప్రయాణంలో కూడా ఒడిదొడుకులు ఉండొచ్చు. అయినా, మనమంత ఆడుతున్నది ఒకే జట్టుకి అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఆటగాళ్ల వ్యక్తిగత ప్రయోజనాల కంటే.. జట్టుకే మొదటి ప్రాధాన్యం ఇస్తాం. అలాగే, గత ఐదారు సంవత్సరాలుగా జట్టు కోసం ఆడుతున్న సీనియర్ ఆటగాళ్లకు అండగా ఉంటాం. భవిష్యత్‌లో కూడా దాన్ని కొనసాగిస్తాం' అని కోహ్లి పేర్కొన్నాడు. మెడనొప్పితో బాధపడుతున్న వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా కోలుకున్నాడని.. రెండో టెస్టుకి అతడు అందుబాటులోకి వస్తాడని కోహ్లి స్పష్టం చేశాడు. డిసెంబర్ 3 నుంచి ముంబయి వేదికగా రెండో టెస్టు ప్రారంభం కానున్న విషయం తెలిసిందే.
ఇదీ చదవండి:IND vs NZ test: తుది జట్టులో ఎవరికి దక్కేనో అవకాశం!