Australia Vs Afghanistan World Cup 2023 : ప్రపంచకప్‌లో అఫ్గానిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా అద్భుత విజయం సాధించింది. గ్లెన్ మ్యాక్స్‌వెల్ తుపాను ఇన్నింగ్స్‌లో అఫ్గాన్ కొట్టుకుపోయింది. 292 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియాకు ఆరంభంలో అఫ్గాన్ బౌలర్లు షాక్ ఇచ్చారు. 91 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా ఓటమి ఖాయమని అంతా భావించారు. కానీ గ్లెన్ మ్యాక్స్‌వెల్ విధ్వంసం సృష్టించాడు. అద్భుత డబల్ సెంచరీతో మ్యాక్స్ వెల్ కంగారులకు అదిరే విజయాన్ని అందించాడు. మ్యాక్స్‌వెల్ గట్టిగా కొడితే సిక్సు.. నిలబడి కొడితే ఫోర్ అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. 128 బంతుల్లో 21 ఫోర్లు, 10 సిక్సర్లతో 201 పరుగులు చేశాడు.
మ్యాక్స్‌వెల్ చేసిన 201 పరుగుల్లో 144 పరుగులు బౌండరీల రూపంలోనే వచ్చాయి. మ్యాక్స్‌వెల్‌కు కమ్మిన్స్ చక్కని సహకారం అందించాడు. 68 బంతులు ఎదుర్కొని 12 పరుగులు చేసి మంచి సహకారం అందించాడు. మ్యాక్స్‌వెల్ విధ్వంసంతో 46.5 ఓవర్లలో మరో 19 బంతులు ఉండగానే ఆస్ట్రేలియా విజయం సాధించింది. అఫ్గాన్ బౌలర్లలో ఒమర్జాయి, నవీన్, రషీద్ ఖాన్ తలో రెండు వికెట్లు తీసుకున్నారు. డబుల్ సెంచరీతో అదరగొట్టిన మ్యాక్స్‌వెల్ 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డును అందుకున్నాడు.
Aus Vs Afg World Cup 2023 : అంతకుముందు టాస్ నెగ్గి బ్యాటింగ్‌కు దిగిన అఫ్గానిస్థాన్.. నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి అఫ్గాన్ 291 పరుగులు చేసింది. ఓపెనర్ ఇబ్రహీం జద్రాన్ (129*; 143 బంతుల్లో 8 ఫోర్లు, మూడు సిక్స్‌లు) సెంచరీ సాధించడం వల్ల ఆసీస్‌కు 292 పరుగుల లక్ష్యాన్ని అఫ్గాన్ నిర్దేశించింది. రషీద్ ఖాన్ 35*(15 బంతుల్లో 2 ఫోర్లు) మెరుపులు మెరిపించాడు. అఫ్గాన్ బ్యాటర్లు రహ్మాత్ షా 30, షాహిది 26, ఒమర్జాయ్ 26, గుర్బాజ్ 21, నబీ 12 పరుగులు సాధించారు. ఆస్ట్రేలియా బౌలర్లలో హేజిల్‌వుడ్ రెండు వికెట్లు తీయగా, మిచెల్ స్టార్క్, మ్యాక్స్‌వెల్, జంపా తలో వికెట్ తీశారు.