ICC T20 World Cup 2024 : క్రికెట్ ప్రియుల కోసం నెట్టింట ఓ తీయ్యటి కబురు ట్రెండింగ్ అవుతోంది. 2024 టీ 20 ప్రపంచకప్ తేదీలు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. వెస్టిండీస్, అమెరికా సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్న ఈ మెగా టోర్నీ వచ్చే ఏడాది జూన్ 4 నుంచి 30 వరకు జరగనున్నట్లు సమాచారం. ఇక ఈ ప్రపంచకప్‌తో ఐసీసీ 2024 - 2031 మధ్య జరిగే టోర్నమెంట్ సైకిల్ కూడా మొదలవుతుంది.
T20 World Cup 2024 Venues : రెండు దేశాల్లో కలిపి మొత్తం పది స్టేడియాల్లో ఈ టోర్నమెంట్ మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. మొదటిసారి అమెరికా ఐసీసీ ఈవెంట్‌కు ఆతిథ్యం ఇవ్వనున్నంది. ఇటీవలె ఐసీసీ బృందం యూఎస్‌లోని స్టేడియాలను సందర్శించింది. అయితే అమెరికాలో మ్యాచ్‌లు నిర్వహించే కొన్ని వేదికలకు అంతర్జాతీయ హోదా లేదు. అందుకని ఐసీసీ.. వెస్టిండీస్, యూఎస్ఏ దేశాల క్రికెట్ బోర్డులతో చర్చలు జరిపి స్టేడియాలపై తుది నిర్ణయం తీసుకోనుంది.
అయితే ఐసీసీ.. 2024 టీ20 ప్రపంచకప్‌ను విండీస్‌తో పాటు అమెరికాలో నిర్వహించడానికి రెండు ప్రధాన కారణాలు ఉన్నట్లు తెలుస్తోంది. మొదటిది అమెరికాలో క్రికెట్‌కు ప్రాధాన్యం లభించే అవకాశం ఉంది. లాస్ ఏంజిల్స్‌లో 2028 ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను చేర్పించాలనే ప్రయత్నం రెండో కారణం. ఒకవేళ ఐసీసీ ప్లాన్ సక్సెస్ అయితే.. 2028 ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను చూడవచ్చు.
ఈసారి భిన్నంగా..
అయితే 26 రోజులపాటు సాగే టోర్నీని ఐసీసీ.. గత ఎడిషన్ల కంటే ఈ సారి భిన్నంగా నిర్వహించనుంది. టోర్నమెంట్లో ఈసారి 20 దేశాలు పాల్గొననున్నాయి. ఈ 20 జట్లను నాలుగు గ్రూపులుగా విభజిస్తారు. ప్రతి గ్రూపులోని టాప్ 2 రెండు జట్లు సూపర్ - 8కు అర్హత సాధిస్తాయి. ఈ ఎనిమిది జట్లను రెండు గ్రూపులుగా విడగొడతారు. ఈ గ్రూపులోని టాప్ - 2 రెండులో నిలిచిన జట్లు సెమీస్ ఆడతాయి.
ఐపీఎల్‌పై ఎఫెక్ట్.. ఇక 2024 టీ20 వరల్డ్ కప్‌నకు ఇవే తేదీలు ఫైనలైతే.. ఐపీఎల్ షెడ్యూల్‌పై తప్పకుండా ప్రభావం పడుతుంది. భారత్ స్వదేశంలో ఆడే మ్యాచ్‌లను ఇప్పటికే ఖరారు చేయడం వల్ల ఐపీఎల్‌ను ముందుకు తీసుకురాలేకపోవచ్చు. ఓవైపు 2024 ఏప్రిల్ - మే లో లోక్‌సభ ఎన్నికలు ఉండటం.. మరోవైపు జూన్ మొదటి వారంలో టీ20 ప్రపంచకప్ ప్రారంభమవడం వల్ల ఐపీఎల్ షెడ్యూల్‌ను ఎలా ఖరారు చేస్తుందో చూడాలి.
T20 WC 2024 Qualifiers : తాజాగా టీ 20 ప్రపంచకప్‌నకు పపువా న్యూ గినియా (పీఎన్‌జీ) అర్హత సాధించింది. 20 జట్లు తలపడే ఈ మెగా టోర్నీకి ఇప్పటివరకూ 15 దేశాలు అర్హత సాధించాయి. కాగా అమెరికా క్వాలిఫయర్ నుంచి ఒకటి.. ఆసియా, ఆఫ్రికా క్వాలిఫయర్స్ నుంచి రెండేసి చొప్పున మరో 5 జట్లు ప్రపంచకప్ బెర్తు దక్కించుకోవాల్సి ఉంది.