Mens ODI player of the year 2021: టీమ్ఇండియాకు ఈ ఏడాది కలిసి రాలేదనే చెప్పాలి. ఇప్పటికే టెస్ట్, టీ20 ప్లేయర్ ఆఫ్ ది ఇయర్-2021 అవార్డుకు నామినేట్ అయిన వారి జాబితాను ప్రకటించిన ఐసీసీ.. ఇప్పుడు వన్డే ప్లేయర్ అఫ్ ది ఇయర్ జాబితాను ప్రకటించింది. ఇందులోనూ భారత ఆటగాళ్లకు చోటు దక్కలేదు. అయితే టెస్ట్ అవార్డు రేసులో మాత్రం అశ్విన్ ఒక్కడికి స్థానం దక్కింది. 'వన్డే ప్లేయర్ ఆఫ్ ది ఇయర్' అవార్డు రేసులో షకీబ్ అల్ హాసన్, బాబర్ అజామ్, జన్నెమన్ మలన్, పాల్ స్టిర్లింగ్ రేసులో ఉన్నట్లు ఐసీసీ పేర్కొంది.
బంగ్లాదేశ్ కెప్టెన్, ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్.. ఈ ఏడాది 9వన్డేలు ఆడి 40 సగటుతో 277 పరుగులు చేశాడు. దీంతో పాటే 17 వికెట్లు కూడా తీశాడు. ఏడాది పాటు నిషేధానికి గురైన ఇతడు.. వెస్టిండీస్‌తో జరిగిన సిరీస్‌తో మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు. ఈ సిరీస్‌ను తమ జట్టు 3-0తేడాతో దక్కించుకోవడంలో 6వికెట్లు పడగొట్టి కీలకంగా వ్యవహరించాడు. ఇక జింబాబ్వే జరిగిన సిరీస్‌లోనూ 145 రన్స్ సహా 8 వికెట్లను దక్కించుకున్నాడు.
పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్.. ఈ ఏడాది కేవలం ఆరు వన్డేలు ఆడి 68 సగటుతో 405 పరుగులు చేశాడు. అందులో రెండు సెంచరీలు ఉన్నాయి. దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 228 పరుగులు చేశాడు. దీంతో 2-1తేడాతో సిరీస్‌ను సొంతం చేసుకోవడంలో ముఖ్య పాత్ర పోషించాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన ఓ మ్యాచ్‌లోనూ 158 పరుగుల భారీ ఇన్నింగ్స్ ఆడాడు. కానీ ఆ మ్యాచ్‌లో పాక్ ఓడిపోయింది.
మలన్, స్టెర్లింగ్ సెంచరీలు
దక్షిణాఫ్రికా ప్లేయర్ మలన్.. ఎనిమిది మ్యాచ్‌లు ఆడి 85 సగటుతో 509 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు, రెండు అర్ధశతకాలు ఉన్నాయి. ఇక ఐర్లాండ్ సీనియర్ ఆటగాడు పాల్ స్టెర్లింగ్ 14 మ్యాచ్‌ల్లో 80 సగటుతో 705 రన్స్ చేయగా.. అందులో మూడు సెంచరీలు, రెండు అర్ధ శతకాలు ఉన్నాయి.
అంతకుముందు 'టీ20 ప్లేయర్ ఆఫ్ ది ఇయర్-2021' అవార్డుకు ఇంగ్లాండ్ బ్యాట్స్‌మన్ జాస్ బట్లర్, శ్రీలంక ఆల్‌రౌండర్ వనిందు హసరంగా, అస్ట్రేలియా ప్లేయర్ మిచెల్ మార్ష్,పాకిస్థాన్ వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్‌ను... 'టెస్ట్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్' అవార్డుకు భారత టాప్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్, న్యూజిలాండ్ ఆల్ రౌండర్ కైల్ జేమిసన్, శ్రీలంక టెస్టు జట్టు సారథి దిముత్ కరుణరత్నె నామినేట్ అయినట్లు ఐసీసీ పేర్కొంది.
ఇదీ చూడండి: 'టీ20 ప్లేయర్ ఆఫ్ ది ఇయర్'.. టీమ్ఇండియా ఆటగాళ్లకు దక్కని చోటు