టీ20 ఫార్మాట్(T20 format)ను తానెంతగానో ఇష్టపడతానని అంటున్నాడు దిగ్గజ క్రికెటర్ సునీల్ గావస్కర్(Sunil Gavaskar). మూడు గంటలపాటు ఉత్కంఠగా సాగే మ్యాచ్‌ను ఆసక్తిగా చూస్తానని చెప్పాడు. దక్షిణాఫ్రికా మాజీ బ్యాట్స్‌మన్ ఏబీ డివిలియర్స్ లాగా ప్రతి ఒక్క బ్యాట్స్‌మన్ అన్ని షాట్లు అడగలగాలని తెలిపాడు.
"నా సమయంలో ఆడిన చాలామంది ఆటగాళ్లకు టీ20 ఫార్మాట్ అంటే నచ్చదు. కానీ, పొట్టి ఫార్మాట్ అంటే నాకిష్టం. కేవలం మూడు గంటల ఆటలో ఫలితం వస్తుంది. ఉత్కంఠభరితంగా సాగుతుంది. టీ20 ఫార్మాట్‌ను ఇష్టపడటానికి అదే కారణం. ఎవరైనా స్విచ్ హిట్ లేదా రివర్స్ స్వీప్ షాడ్ ఆడితే కుర్చీలోంచి ఠక్కున లేచి నిల్చుంటా. అద్భుతమైన, నమ్మశక్య కాని షాట్లు అవి. ఆ షాట్లతో సిక్సర్లు రాబట్టడానికి చాలా నైపుణ్యం కావాలి.
- సునీల్ గావస్కర్, టీమ్ఇండియా మాజీ క్రికెటర్
దక్షిణాఫ్రికా మాజీ బ్యాట్స్‌మన్ ఏబీ డివిలియర్స్(AB de villiers).. తన అద్భుతమైన బ్యాటింగ్‌తో ఎలాంటి షాట్‌నైనా ఆడగలడని గావస్కర్ కితాబు ఇచ్చాడు. "ఏబీ డివిలియర్స్ చాలా సునాయాసంగా బ్యాటింగ్ చేస్తాడు. అతనిది సొగసైన బ్యాటింగ్ శైలి. ఎక్కువ దూరం సిక్సర్లు బాదుతాడు. డివిలియర్స్ కొన్ని షాట్లు ఆడినప్పుడు ఫాలోత్రూలో బ్యాట్ భుజంపైకి వెళ్లడం నాకెంతో ఇష్టం. ఏదో బలంగా బాదిన షాట్ కాదిది. కచ్చితమైన షాట్ ఆడతాడు. అతని బ్యాటింగ్ అంటే నాకెంతో ఇష్టం. ప్రతి ఒక్కరు అతనిలా ఆడాలి. 360 డిగ్రీలలో అన్ని షాట్లు బాదాలి" అని గావస్కర్ వెల్లడించాడు.
ఇదీ చూడండి: 'షెడ్యూల్ ప్రకారం ఒలింపిక్స్ జరిగితే పతకం ఖాయం!'