టీమ్ఇండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్‌కు (Yuvraj Singh) సంబంధించిన ఓ కేసుపై.. పంజాబ్-హరియాణా హైకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో ఆధారాలను తిరిగి సమర్పించాలనుకుంటున్నట్లు యువీ తరఫు న్యాయవాది పునీత్ బాలి తెలిపారు. అయితే ఇప్పటికే చాలా సమయమిచ్చినట్లు.. ఫిర్యాదుదారు తరఫు న్యాయవాది అర్జున్ షియోరాన్ పేర్కొన్నారు.
ఈ కేసుపై స్పందించిన హైకోర్టు బెంచ్.. 'దర్యాప్తు ఎంతవరకు వచ్చిందని.. యువరాజ్ పేరును చేర్చారా? లేదా?' అని పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ను (పీపీ) ప్రశ్నించింది. 'ఒక్కసారి మాత్రమే యువరాజ్ సింగ్ దర్యాప్తులో చేరారని.. కానీ అతడి నుంచి ఎలాంటి సహకారం లభించలేదని.. అతడి మొబైల్‌ను ఇవ్వడానికి నిరాకరించాడని' పీపీ పేర్కొన్నారు. 'యువరాజ్ దర్యాప్తునకు సహకరించకుంటే అతడిపై తీవ్రస్థాయిలో చర్యలు తీసుకోవాల్సి వస్తుందని' కోర్టు హెచ్చరించింది. ఈ విషయాన్ని పిటిషనర్ తరఫు న్యాయవాదికి స్పష్టం చేసింది.
'యువరాజ్ ప్రస్తుతం దుబాయ్‌లో ఉన్నాడని' న్యాయవాది పునీత్ బాలి బదులిచ్చారు. 'అక్కడినుంచి రాగానే అతడిని దర్యాప్తులో భాగం చేయనున్నట్లు' వెల్లడించారు. తదుపరి విచారణను సెప్టెంబర్ 6కి వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు బెంచ్ తెలిపింది. ఏవైనా ఆధారాలు సమర్పించాలనుకుంటే.. ఈ గడువు లోపు చేయాలని ఆదేశించింది.
ఓ వర్గంపై యువీ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడని.. సామాజిక కార్యకర్త, న్యాయవాది రజత్ కల్సన్ ఆరోపిస్తూ, హరియాణాలోని హన్సీ గ్రామంలో పోలీసు కేసు పెట్టారు. తనపై కేసును కొట్టివేయాలంటూ యువీ హైకోర్టులో పిటిషన్ వేశాడు.
ఇదీ చదవండి: Ashish Nehra: 'గతంలో ఇలా ఆడలేదు.. కొత్త పుజారాను చూస్తున్నాం'