Goutham Gambhir: భారత మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నాడు. ఓ క్రికెట్ జట్టుతో గొడవ పడినందుకు రెండు నెలల పాటు పాఠశాల నుంచి సస్పెండ్ చేసినట్లు చెప్పుకొచ్చాడు. ఆ వివాదం వల్ల ప్రధానోపాధ్యాయుడు కన్నీరుపెట్టుకున్నాడని చెప్పాడు. ఓ యూట్యూబ్ ఛానల్లో మాట్లాడిన అతడు ఈ విషయాల్ని పంచుకున్నాడు.
"ఐటీఎస్సీ పోటీల్లో పాల్గొనడానికి 'ఒమన్ హౌజ్'కు వెళ్లాం. అక్కడ రెండు జట్ల సభ్యులు షూలతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. మేం గొడవపడి హౌజ్‌లోని ఓ చిత్రపటాన్ని పగలగొట్టాం. ఒమన్ నుంచి తెచ్చిన ఆ చిత్రపటాన్ని చూసి అక్కడి ప్రధానోపాధ్యాయుడు కన్నీరు పెట్టుకున్నాడు."
-గౌతమ్ గంభీర్, భారత మాజీ క్రికెటర్
ఈ వివాదం వల్ల తనకు ఇచ్చిన 'పర్ఫెక్ట్ బ్యాడ్జ్' వెనక్కి తీసుకున్నారని.. బోర్డు పరీక్షలు రాయడానికి మాత్రమే అనుమతినిచ్చారని గంభీర్ తెలిపాడు. తోటి విద్యార్థులు పాఠశాలకు వెళ్తుంటే.. తాను రంజీ ట్రోఫీలో పాల్గొన్నాని పేర్కొన్నాడు.
గౌతమ్ గంభీర్ 2003లో టీమ్ఇండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్ అరంగేట్రం చేశాడు. తన కెరీర్లో 58 టెస్టులు, 147 వన్డేలు, 37 టీ20 మ్యాచులాడిన గంభీర్.. 10వేలకు పైగా పరుగులు సాధించాడు. 2018లో అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్ తీసుకున్నాడు.
ఇదీ చదవండి: ' ఆ నలుగురు బ్యాటింగ్‌లో అస్సలు కంగారు పడరు'