Glenn Maxwell IPL 2024 : ఇండియన్ ప్రీమియర్ లీగ్- ఐపీఎల్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్. జీవితంలో నడవలేని స్థితికి చేరుకునే వరకు ఐపీఎల్‌లో ఆడతానని అన్నాడు. ఆసీస్ వరల్డ్ కప్ విజయంలో కీలకపాత్ర పోషించిన 35 ఏళ్ల ఈ ప్లేయర్ ఐపీఎల్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలిపాడు.
'బహుశా నా క్రికెట్ కెరీర్‌లో ఆడే చివరి టోర్నీ ఐపీఎల్ కావొచ్చు. నడవలేని స్థితికి చేరుకునే వరకు ఐపీఎల్‌లో ఆడతాను. ఏబీ డివిలియర్స్, విరాట్ కోహ్లీతో కలిసి భుజాలు కలపడం వారితో మాట్లాడుకుంటూ మిగతా వాళ్ల ఆట కూడా చూడటం ఏ ఆటగాడైనా కోరుకునే గొప్ప అనుభూతి. టీ20 వరల్డ్ కప్‌నకు ముందు వీలైనంత ఎక్కువ మంది ఆసీస్ ఆటగాళ్లు ఐపీఎల్‌లో ఆడతారని భావిస్తున్నాను' అని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు- ఆర్సీబీ ప్లేయర్ మ్యాక్స్‌వెల్ తెలిపాడు. మరోవైపు వచ్చే ఏడాది జూన్‌లో జరిగే టీ20 ప్రపంచకప్‌నకు వెస్టిండీస్- అమెరికా సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్నాయి.
Maxwell Stats In IPL : ఇటీవల ముగిసిన వన్డే వరల్డ్ కప్ టోర్నీలో అద్భుతంగా రాణించాడు మ్యాక్స్‌వెల్. ఇందులో ఒక డబుల్ సెంచరీ కూడా నమోదు చేశాడు. అంతేకాకుండా ఆ తర్వాత భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లను అదరగొట్టాడు. ఐపీఎల్‌లో ఆర్సీబీ తరఫున ప్రాతినిధ్య వహిస్తున్న మ్యాక్స్‌వెల్ ఆ జట్టులో మంచి ప్రదర్శన చేశాడు. 2021 ఐపీఎల్ సీజన్లో 144 స్ట్రైక్ రేట్‌తో 513 పరుగులు చేశాడు. ఇక గత ఐపీఎల్ ఎడిషన్‌లో 183 స్ట్రైక్ రేట్‌తో 14 మ్యాచ్‌ల్లో 400 పరుగులు సాధించాడు. దీంతో 2024 వేలానికి ముందు మ్యాక్వెల్ను రిటైన్ చేసుకుంది ఆర్సీబీ ఫ్రాంచైజీ. ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, స్వీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్ వేలంలో తమ పేరును నమోదు చేసుకున్నారు. ఇక ఐపీఎల్ 2024 మినీ (IPL Auction 2024) డిసెంబర్ 19న జరగనుంది.