Pak cricketer Rashid latif on Teamindia: టీ20 ప్రపంచకప్ పోటీలకు ముందు టీమ్‌ఇండియా బ్యాటింగ్ ఆర్డర్‌పై దృష్టిపెట్టింది. ఈ క్రమంలో బ్యాటర్ల బ్యాటింగ్ స్థానాలను మారుస్తూ రొటేషన్ పద్ధతిలో పరీక్షిస్తోంది. ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్ సందర్భంగా దూకుడుగా ఆడే రిషభ్ పంత్‌ను రెండు మ్యాచుల్లో టీమ్‌ఇండియా ఓపెనింగ్‌కి పంపించింది. ఒక మ్యాచ్‌లో ఫర్వాలేదనిపించిన పంత్.. ఇంకో మ్యాచ్‌లో తేలిపోయాడు. అయితే ఇంగ్లాండ్‌పై టీ20 సిరీస్ 2-1 తేడాతో భారత్ కైవసం చేసుకుంది. ఈ క్రమంలో టీమ్‌ఇండియా చేస్తున్న ఆటగాళ్ల బ్యాటింగ్ రొటేషన్‌పై పాక్ మాజీ కెప్టెన్ రషీద్ లతీఫ్ స్పందించాడు. అతిగా ప్రయోగాలు చేయడం వల్ల అనర్థాలు జరిగే ప్రమాదం ఉందని హెచ్చరించాడు.
"రిషభ్ పంత్‌ను టాప్‌ఆర్డర్‌లో ఆడించారు. అయితే పంత్ లోయర్ డౌన్‌లో డేంజరస్ బ్యాటర్. పవర్‌ప్లేలో ఎవరైనా ధాటిగా ఆడగలరు. పది మందిలో తొమ్మిది మంది ఓపెనర్లే. కానీ అసలైన గేమ్ మిడిల్ ఓవర్లలోనే ఉంటుంది. శ్రేయస్ అయ్యర్ లోయర్ ఆర్డర్‌లో 28 పరుగులే చేసినా.. అవి టాప్‌ఆర్డర్‌లో చేసిన 30 పరుగుల కంటే చాలా విలువైనవి. అందుకే టీమ్‌ఇండియా వ్యూహాలు మరీ అతిగా అనిపిస్తున్నాయి. లేకపోతే ఇంగ్లాండ్ మీద 3-0తో సిరీస్‌ను కైవసం చేసుకునేది" అని లతీఫ్ వివరించాడు.
తరచూ తుదిజట్టును మారుస్తూ ఉండటం కూడా ఆటగాళ్ల ప్రదర్శనపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని లతీఫ్ అభిప్రాయపడ్డాడు. ‘‘రోహిత్, కేఎల్ రాహుల్ వంటి ఆటగాళ్ల విషయంలో ఇలా రొటేషన్ జరగదు. ఇప్పటి వరకు టీమ్‌ఇండియా జట్టు రూపకల్పన అంతా రోహిత్, కోహ్లీలను బేస్ చేసుకొని తయారైంది. వీరిద్దరూ ఫామ్‌లో లేకపోతే ఇతర ఆటగాళ్లు ఆ బాధ్యతను తీసుకొనేవారు. కానీ జట్టులో రొటేషన్ పద్ధతిని అతిగా అమలు చేయడం వల్ల ఎవరూ బాధ్యతను తీసుకొనే అవకాశం ఉండదు. అందుకే జట్టు ఓడితే దానికి కారణం రోహిత్, కోహ్లీనే కనిపిస్తారు’’ అని లతీఫ్ తెలిపాడు.
ఇదీ చూడండి: బుమ్రా, రోహిత్ సూపర్ షో.. తొలి వన్డేలో ఇంగ్లాండ్‌పై భారత్ రికార్డు విజయం