గతేడాది లాక్‌డౌన్ సమయంలో వ్యక్తులుగా మరింత మెరుగయ్యామని 'టీమ్‌ఇండియా బ్రదర్స్' హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా అన్నారు. తమలో నిజాయతీ పెరిగిందన్నారు. తామిద్దరం భారత్‌కు ఆడాలని తమ తండ్రి కలగన్నారని వివరించారు. కరోనా వైరస్ వల్ల భారత్ సహా ప్రపంచమంతా ఇబ్బందులు పడుతోందని వెల్లడించారు. వచ్చే నెలలో శ్రీలంక పర్యటనకు వీరిద్దరూ సిద్ధమవుతున్నారు.
"ఈ లాక్‌డౌన్లు, ఆంక్షలు చూస్తుంటే ప్రపంచమంతా కఠిన దశను అనుభవిస్తోందని అనిపిస్తోంది. ఈ ఏడాదీ ఐపీఎల్ వాయిదాపడింది. దేశంలో కరోనా కేసుల సంఖ్య పెరగడం దురదృష్టకరం. ఈ పరిస్థితులన్నీ చూస్తుంటే కాలం కఠినంగా ఉందని తెలుస్తోంది" అని కృనాల్ అన్నాడు. లాక్‌డౌన్ ఒక విధంగా తమను మరింత దగ్గర చేసిందని, నిజాయతీగా మార్చిందని హార్దిక్ అంటున్నాడు.
ఇదీ చదవండి: WTC Final: టీమ్ఇండియా ప్రాక్టీస్ ముమ్మరం
"గత లాక్‌డౌన్‌లో మేం వ్యక్తులుగా మెరుగయ్యాం. మా నైపుణ్యాలు, దేహదారుఢ్యాన్ని మెరుగు పర్చుకున్నాం. దేవుడి దయవల్ల జిమ్ అందుబాటులో ఉంది. మేమిద్దరం ఒకరితో ఒకరం ఎక్కువ సమయం గడిపాం. కృనాల్‌లో ఏవైనా తప్పులుంటే నేను చెప్పేవాడిని. అతడు నా గురించి చెప్పేవాడు. మా వరకు ఈ లాక్‌డౌన్ ఒక అభివృద్ధి దశ. మా జీవిత లక్ష్యాలు మారాయి. మనుషులుగా మేం మరింత మెరుగయ్యాం. మాలో నిజాయతీ పెరిగింది" అని హార్దిక్ తెలిపాడు.
ఈ స్థాయిలో ఉంటామని తమకెప్పుడూ అనిపించలేదని కృనాల్ తెలిపాడు. "నా పిల్లలిద్దరూ భారత్‌కు ఆడతారు" అని తనకు ఆరేళ్లున్నప్పుడు తన తండ్రి అనేవారని గుర్తు చేసుకున్నాడు. అందుకోసం ఎన్నో కష్టాలు పడ్డారని వివరించాడు. ఆయన దార్శనికత వల్లే తాము ఇప్పుడిలా ఉన్నామని వెల్లడించాడు.
ఇదీ చదవండి: 'షకిబుల్ లాంటి ఆటగాళ్లు అవసరమా?'