ICC Cricket World Cup 2023 : అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐసీసీ ప్రపంచ కప్ 2023 క్రికెట్ మహా సమరానికి కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. సరిగ్గా 99 రోజులు మిగిలి ఉన్న ఈ మెగా టోర్నీకి సంబంధించి షెడ్యూల్‌ను ఐసీసీ మంగళవారం విడుదల చేసింది. ఈ నేపథ్యంలో అక్టోబర్ 5 నుంచి భారత్ వేదికగా జరగబోయే ఐదు కీలకమైన గ్రూప్ దశ మ్యాచ్‌లు ఇవే.
భారత్ వర్సెస్ పాకిస్థాన్!
India vs Pakistan World Cup 2023 : ఇండియా-పాకిస్థాన్ మధ్య మ్యాచ్ అంటేనే క్రికెట్ ప్రియులకు ఎక్కడ లేని జోష్ వస్తుంది. ఇక ఈ రెండు జట్లు వరల్డ్ కప్ కోసం పోటీ పడుతున్నాయంటే.. ఇక అభిమానుల్లో అంచనాలు మరింత పెరిగిపోతాయి. ఈ క్రమంలో తన చిరకాల ప్రత్యర్థి అయిన పాక్‌ను ఢీకొట్టేందుకు భారత్ ఆటగాళ్లు తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు. అక్టోబర్ 15న గుజరాత్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్-పాక్ మ్యాచ్ జరగనుంది.
అయితే ఇప్పటివరకు జరిగిన వన్డే ప్రపంచకప్‌లో ఇండియా-పాకిస్థాన్ తలపడిన మ్యాచుల్లో.. ఏడు సార్లు భారత్ గెలిచింది. గతేడాది మెల్‌బోర్న్‌లో పాకిస్థాన్‌తో జరిగిన టీ20 ప్రపంచ కప్‌లో కింగ్ విరాట్ కోహ్లీ పరుగుల వరద పారించి ఉత్కంఠభరితమైన విజయాన్ని జట్టుకు అందించాడు. ఈ క్రమంలో అభిమానులు భారత జట్టుపై భారీ ఆశలే పెట్టుకున్నారు. మరోవైపు అంతర్జాతీయ వన్డేల్లో నెంబర్ 1గా కొనసాగుతున్న పాక్ కెప్టెన్ బాబర్ ఆజామ్ సారథ్యంలోని దాయాది దేశం జట్టును కూడా తక్కువ అంచనా వేయలేము.
ఇంగ్లాండ్ వర్సెస్ న్యూజిలాండ్!
England vs New Zealand World Cup Final : ఈ ఏడాది జరిగే ప్రపంచకప్ టోర్నీ ఈ రెండు జట్ల మధ్య జరగనున్న మ్యాచ్‌తోనే ప్రారంభం కానుంది. నాలుగేళ్ల క్రితం ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓడిపోయినందుకు ప్రతీకారం తీర్చుకునేందుకు న్యూజిలాండ్ భావిస్తోంది. ప్రస్తుతం కెప్టెన్ కేన్ విలియమ్సన్ మోకాలి గాయంతో బాధపడుతున్నాడు. ఈ నేపథ్యంలో అతడు త్వరగా కోలుకొని జట్టులో కీలకంగా మారుతాడా లేదా అనేది వేచి చూడాల్సిందే.
ఇక 2019లో ఆస్ట్రేలియాలో జరిగిన ప్రపంచ కప్ టైటిల్‌ను, 2022లో టీ20 వరల్డ్ కప్ కిరీటాన్ని ఎగరేసుకుపోయిన ఇంగ్లాండ్ ఈసారి కూడా కప్పును దక్కించుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. అయితే ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో వరుసగా 4,5 స్థానాల్లో ఉన్న న్యూజిలాండ్, ఇంగ్లాండ్‌ల మధ్య వరల్డ్ కప్ వార్ అహ్మదాబాద్ వేదికగా అక్టోబర్ 5న జరగనుంది.
భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా!
India vs Australia World Cup 2023 : సొంతగడ్డపై భారత్ ఆడనున్న తొలి మ్యాచ్ ఇది. చెన్నై వేదికగా ప్రపంచ క్రికెట్‌లో అత్యుత్తమ ప్రదర్శనను కనబరుస్తూ ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన ఆస్ట్రేలియాతో అక్టోబర్ 8న టీమ్ఇండియా తలపడనుంది. లండన్‌లోని ఓవల్ మైదనంలో జరిగిన ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయిన భారత్.. కంగారూలను కంగారు పెట్టించేందుకు తీవ్ర కసరత్తులు చేస్తోంది.
ఆస్ట్రేలియా వర్సెస్ దక్షిణాఫ్రికా!
Australia vs South Africa 2023 : 2019 ప్రపంచ కప్‌లో దక్షిణాఫ్రికా కేవలం మూడు మ్యాచ్‌ల్లో మాత్రమే గెలుపొందింది. మాంచెస్టర్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా కెప్టెన్ డూప్లెసిస్ సెంచరీతో చెలరేగిపోయి.. ఆసీస్‌ను చిత్తుగా ఓడించాడు. అయితే ఈ స్టార్ బ్యాటర్ ఈ సారి భారత్‌లో జరిగే మెగా టోర్నీకి హాజరవుతాడా లేదా అన్నది అనుమానమే. ఈ సంవత్సరం జరిగిన ఐపీఎల్ సీజన్లో కూడా ఈ రైట్‌హ్యాండర్ అద్భుతమైన ఆటతీరును కనబరిచాడు. దీంతో దక్షిణాఫ్రికా జట్టులో కూడా బలమైన ఆటగాళ్లకు కొదవలేదని నిరూపించాడు. మరోవైపు ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో నెంబర్ 1గా ఉన్న ఆస్ట్రేలియా.. దక్షిణాఫ్రికా ఆటగాళ్లు ఏ మేర అడ్డుకుంటుందో వేచి చూడాలి. అక్టోబర్ 13న లఖ్‌నవూ వేదికగా ఈ ఇరు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది.
బంగ్లాదేశ్ వర్సెస్ ఆఫ్ఘానిస్థాన్!
Bangladesh vs Afghanistan Series 2023 : ధర్మశాల వేదికగా అక్టోబర్ 7న జరగనున్న మ్యాచ్ కోసం బంగ్లాదేశ్ ఆఫ్ఘానిస్థాన్ గట్టిగానే ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో మంచి ప్లాన్‌తో దిగిన అఫ్ఘన్ టీమ్.. స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్‌తో పాటు మరో బౌలర్ ముజీబ్ ఉర్ రెహ్మాన్ లాంటి బలమైన బౌలర్లను రంగంలోకి దింపనుంది. ఇక మంచి ఫామ్‌లో ఉన్న మరో అఫ్ఘాన్ పేసర్ ఫజల్‌హాక్ ఫరూఖీ కూడా జట్టులో కీలకం కానున్నాడు. అయితే ఇప్పటికే అనేక సార్లు మెగా టోర్నీలో ఆడిన అనుభవం బంగ్లాదేశ్‌కు సానుకూలాంశం. టాప్ ఆర్డర్ బ్యాటర్ లిట్టన్ దాస్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ వంటి ఆటగాళ్లు బంగ్లా జట్టులో కీలకంగా ఉన్నారు.