చెన్నై వేదికగా ఫిబ్రవరి 13 నుంచి జరగనున్న రెండో టెస్టుకు ప్రేక్షకులను అనుమతించడంపై హర్షం వ్యక్తం చేశాడు ఇంగ్లాండ్ పేసర్ జేమ్స్ అండర్సన్. కరోనా నేపథ్యంలో తొలి టెస్టుకు ప్రేక్షకులను అనుమతించలేదు.
అయితే రెండో టెస్టుకు మాత్రం 50 శాతం వీక్షకులను అనుమతిస్తూ బీసీసీఐ నిర్ణయించిందని తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ వెల్లడించింది.
'హోటల్లో కఠిన ఆంక్షలు ఉన్నాయి. అన్ని జాగ్రత్తలు తీసుకుని వీక్షకులను అనుమతిస్తారని భావిస్తున్నాను. ప్రేక్షకుల ముందు క్రికెట్ ఆడటం గొప్పగా ఉంటుంది. రెండో టెస్టు కోసం ఎదురుచూస్తున్నాం' అని జిమ్మీ తెలిపాడు.
కాగా, మొదటి టెస్టులో అద్భుతంగా రాణించి ఇంగ్లాండ్ విజయంలో కీలక పాత్ర పోషించిన అండర్సన్.. ఇది సమష్టి విజయమన్నాడు. ప్రతి మ్యాచ్కు తనను తాను మెరుగుపర్చుకుంటానని పేర్కొన్నాడు.
ఇదీ చదవండి: 'టెస్టుల్లో ఇలాంటి బంతిని ఏ జట్టూ కోరుకోదు'