ఓవల్ మైదానంలో(Oval Test 2021) సాధించిన ఘన విజయంతో భారత్.. ఇంగ్లాండ్ జట్టు లోపాల్ని ఎత్తి చూపిందని ఆ దేశ మాజీ క్రికెటర్ మైఖేల్ వాన్(Michael Vaughan News) అన్నాడు. "నాలుగో టెస్టులో ఇంగ్లాండ్ జట్టు బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా అన్ని విభాగాల్లో విఫలమైంది. క్యాచ్‌లు నేలపాలు చేయడం వల్ల మొదలైన ఈ వైఫల్యం బ్యాటింగ్, బౌలింగ్ చేయడంలోనూ స్పష్టంగా కనిపించింది. రెండో ఇన్నింగ్స్‌లో బౌలర్లు పూర్తిగా తేలిపోయారు. వికెట్లు తీసేందుకు చాలా కష్టపడ్డారు" అని వాన్ అన్నాడు.
"రెండేళ్లుగా ఇంగ్లాండ్ ఫీల్డింగ్ మెరుగుపడలేదు. తరుచుగా క్యాచ్‌లు వదిలేస్తూ విజయానికి దూరమవుతోంది. నాలుగో టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో 125 పరుగులకే భారత్‌ని కట్టడి చేసే అవకాశం వచ్చినా.. క్యాచ్‌లు వదిలేయడం వల్ల ఆ జట్టు 191 పరుగులు చేయగలిగింది. అలాగే మొదటి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ భారీ పరుగులు చేయలేకపోయింది. బ్యాట్స్‌మెన్ ఏకాగ్రత లోపించి చెత్త షాట్లు ఆడుతున్నారు. ఓపెనర్ హసిబ్ హమీద్ వైడ్ బాల్‌ని వేటాడి ఔటయ్యాడు. అలాగే, మొయిన్ అలీ అనవసర షాట్ ఆడి ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. ఇంగ్లాండ్ పేస్ బౌలింగ్‌లో కూడా కొత్తదనం లోపించింది. ఆటగాళ్లు ఎక్కువగా పిచ్‌పై ఆధారపడుతున్నారు. పిచ్ సహకరిస్తే 20 వికెట్లు తీస్తున్నారు. లేకపోతే పూర్తిగా తేలిపోతున్నారు."
-మైఖేల్ వాన్, ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్.
"బ్యాట్స్‌మెన్ మధ్య సమన్వయం కూడా లోపించింది. డేవిడ్ మలన్ రనౌట్ అవ్వడమే అందుకు మంచి ఉదాహరణ. ప్రత్యర్థి జట్టు కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తున్నప్పుడు సింగిల్స్ తీసేందుకు ప్రయత్నించాలి. అయితే, హమీద్ సింగిల్‌కు పిలుస్తాడని ఊహించని డేవిడ్ మలన్.. అనూహ్య రీతిలో రనౌటయ్యాడు. అలాగే జట్టు కూర్పులో కూడా లోపాలున్నాయి. మంచి ఫామ్‌లో ఉన్న మార్క్ వుడ్‌ని పక్కన పెట్టడం తప్పుడు నిర్ణయం. పరిస్థితులకు అనుగుణంగా తెలివిగా నిర్ణయాలు తీసుకోవాలి. ఒత్తిడిని ఎలా అధిగమించాలో కూడా ఇంగ్లాండ్ జట్టు తెలుసుకోవాలి. రెండు సంవత్సరాలుగా జట్టుకు దూరంగా ఉన్న మొయిన్ అలీని వైస్ కెప్టెన్‌గా నియమించడం వల్ల కొంత గందరగోళానికి గురయ్యా. అతడు ఇంకా జట్టులో కుదురుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. అతడికి బదులుగా.. రెగ్యులర్‌గా టీమ్‌లో ఆడుతున్న రోరీ బర్న్స్‌కి వైస్ కెప్టెన్ బాధ్యతలు అప్పగించడం ఉత్తమం" అని వాన్ సూచించాడు.
నాలుగో టెస్టు(Ind vs Eng 4th test) మొదటి ఇన్నింగ్స్‌లో వెనుక బడిన టీమ్ఇండియా అనూహ్యంగా పుంజుకుని 157 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది. దీంతో 5 మ్యాచుల ఈ సిరీస్‌లో 2-1తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.
ఇదీ చదవండి:
Ind vs Eng: ఒత్తిడిలో ఇంగ్లాండ్- చివరి టెస్టు కోసం జట్టులోకి ఆ ఇద్దరు..