ఇంగ్లాండ్‌తో జరగనున్న మూడో టెస్టుకు జట్టులో ఎలాంటి మార్పు ఉండదని టీమ్ఇండియా సారథి విరాట్ కోహ్లీ తెలిపాడు. లార్డ్స్ వేదికగా జరిగిన రెండో టెస్టులో 151 పరుగులతో ఘన విజయం సాధించిన టీమ్‌తోనే బరిలోకి దిగుతామని చెప్పాడు. ఐదు టెస్టుల సిరీస్‌లో 2-0 ఆధిక్యం సాధించాలని భావిస్తున్నామని.. అందుకే 'విన్నింగ్ కాంబినేషన్'ను మార్చాలని అనుకోవడం లేదని స్పష్టం చేశాడు.
"జట్టులో మార్పులు చేయడానికి ఎలాంటి కారణాలు లేవు. కొద్ది రోజులుగా అందరూ స్థిరంగా ఆడుతున్నారు. అందుకే విన్నింగ్ కాంబినేషన్‌ని మార్చాల్సిన అవసరం లేదని అనుకుంటున్నా" అని కోహ్లీ చెప్పాడు.
"అతిథ్య జట్టులో బెన్ స్టోక్స్, జోఫ్రా ఆర్చర్, పేసర్ స్టువర్ట్ బ్రాడ్ వంటి స్టార్ ఆటగాళ్లు లేకపోవడం భారత్‌కు కలిసొచ్చే అంశం కదా.. ఇది సిరీస్‌ను కైవసం చేసుకోవడానికి మంచి అవకాశంగా భావిస్తున్నారా?" అని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు.. కోహ్లీ ఘాటుగా బదులిచ్చాడు.
"అది ప్రత్యర్థి బలం మీద ఆధారపడి ఉంటుంది? కీలక ఆటగాళ్లు ఆడుతున్నప్పుడు కూడా ఎవరినైనా ఓడించగలమని భావిస్తాం. ప్రత్యర్థి బలహీనమయ్యే వరకు వేచి ఉండం" అని పేర్కొన్నాడు.
ప్రస్తుతం 1-0తో ఆధిక్యంతో ఉత్సాహంతో ఉన్న టీమ్ఇండియా.. ఆగస్టు 25న లీడ్స్ వేదికగా మూడో టెస్టుకు సన్నద్ధమవుతోంది.
ఇదీ చూడండి: మూడో టెస్టుకు అందుబాటులో భారత స్టార్ పేసర్!