దేశం కోసం ఆడేటప్పుడు దేనికైనా సిద్ధపడాలని టీమ్‌ఇండియా మాజీ సారథి, బ్యాటింగ్ దిగ్గజం సునీల్ గావస్కర్ అన్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టి 50 వసంతాలు పూర్తి చేసుకున్న అతడు ఇంగ్లాండ్ ఆటగాళ్ల రొటేషన్ పద్ధతిపై స్పందించాడు.
"ఆటగాళ్లకు పనిభారం తగ్గించడం లేదా రొటేషన్ పద్ధతి అనేది అర్థం చేసుకోవడం చాలా కష్టం. బయోబుడగలో నెలల తరబడి ఉండటమనేది కూడా కష్టమని నేను ఒప్పుకుంటాను. ఎందుకంటే సెప్టెంబర్ నుంచీ నేను అందులో ఒకడిగా ఉన్నాను. కానీ, దేశం తరఫున ఆడేటప్పుడు ఎలాంటి కష్టాలనైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. అలా లేకపోతే నీ జట్టు తరఫున ఎలా బాగా ఆడగలవు?."
- సునీల్ గావస్కర్, లెజండరీ క్రికెటర్
అయితే, ఇంగ్లాండ్ ఓటమికి ఆటగాళ్ల రొటేషన్ పద్ధతి కూడా కారణమని గావస్కర్ వివరించాడు. "టీమ్‌ఇండియా సైతం చాలా కాలంగా బయోబుడగలో ఉంది. అయినా.. ఆస్ట్రేలియా, భారత్‌లో ఎలా పోరాడిందో మనం చూశాం. నాలుగో టెస్టులో క్లిష్ట పరిస్థితుల్లోనూ యువ బ్యాట్స్‌మెన్ చక్కగా ఆడారు. రిషభ్‌పంత్, వాషింగ్టన్ సుందర్, అక్షర్‌పటేల్ అద్భుత భాగస్వామ్యాలు జోడించారు. అవసరమైన వేళ జట్టు కోసం రాణించడం గొప్ప విశేషం. అలాంటిది జట్టుకు అవసరమైన వేళ ఇంగ్లాండ్ ఆటగాళ్లు పనిభారం పేరిట స్వదేశానికి తిరిగి వెళ్లారు. అలా వెళ్లడం వల్ల ఇలాంటి ఫలితాలే వస్తాయి" అని బ్యాటింగ్ లెజెండ్ తన అభిప్రాయం పంచుకున్నాడు.
ఇదిలా ఉండగా, చెన్నైలో జరిగిన తొలి టెస్టులో విజయం సాధించిన ఇంగ్లాండ్ తర్వాత మూడు టెస్టుల్లోనూ ఘోర పరాభవాలు చవిచూసింది. జాస్‌బట్లర్, మొయిన్ అలీ లాంటి కీలక ఆటగాళ్లు సిరీస్ మధ్యలో స్వదేశం వెళ్లిపోగా, బెయిర్‌స్టో చివరి రెండు టెస్టుల్లో ఆడాడు. ఇలా కీలక ఆటగాళ్లను మార్చడం కూడా ఇంగ్లాండ్ ఓటమికి ఓ కారణమని క్రికెట్ పండితులు అభిప్రాయపడుతున్నారు.
ఇదీ చూడండి: 'సొంతగడ్డ'పై ఎదురులేని భారత్