T20 World Cup Final Rain: టీ20 ప్రపంచకప్ ఫైనల్ పోరు ఆదివారం మెల్‌బోర్న్ వేదికగా జరగనుంది. అయితే ఈ మ్యాచ్‌కు వరుణుడి ముప్పు పొంచి ఉంది. రిజర్వ్ డే రోజునా వర్షం పడే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే ఈ ట్రోఫీని ఇంగ్లాండ్, పాకిస్థాన్‌ను పంచుకోనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు.
మెల్‌బోర్న్‌లో ఆదివారం, సోమవారం వర్షం పడే అవకాశాలు 95శాతం ఉన్నాయని అక్కడి వాతావరణ శాఖ అంచనా వేసింది. "ఆదివారం ఉరుములు, మెరుపులతో కూడిన అతి భారీ వర్షం పడే అవకాశముంది. ఆ రోజు 25 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవ్వొచ్చని అంచనా. ఇక దురదృష్టవశాత్తూ సోమవారం కూడా 5 నుంచి 10 మిల్లీమీటర్ల మధ్య వర్షపాతం నమోదు కావొచ్చు" అని మెల్‌బోర్న్ మెటరాలజీ బ్యూరో వెల్లడించింది.
టోర్నమెంట్ నిబంధనల ప్రకారం.. సాధ్యమైనంత వరకు తక్కువ ఓవర్లకు కుదించైనా మ్యాచ్‌ను నిర్వహించడమే ప్రథమ ప్రాధాన్యం. అయితే, నాకౌట్ దశలో కనీసం 10 ఓవర్ల మ్యాచ్ అయినా నిర్వహించాల్సి ఉంటుంది. ఒకవేళ ఆదివారం మ్యాచ్ మొదలై వర్షం కారణంగా ఆగిపోతే.. రిజర్వ్‌డే రోజున మిగతా ఆటను కొనసాగిస్తారు. రిజర్వే డే రోజునా మ్యాచ్‌ను కొనసాగించే పరిస్థితి లేనప్పుడు.. ఇరు జట్లు టైటిల్‌ను పంచుకుంటాయి.
వన్డే ప్రపంచకప్ 2019 సెమీఫైనల్ మ్యాచ్‌కు వర్షం ఆటంకం కలిగించడంతో.. భారత్, న్యూజిలాండ్ మ్యాచ్ రెండు రోజులు జరిగింది. ఇక 2002లో భారత్, శ్రీలంక మధ్య ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ సమయంలోనూ ఇలాగే జరిగింది. మ్యాచ్ మొదలుపెట్టాక వర్షం కారణంగా మధ్యలోనే ఆగిపోయింది. అప్పటి నిబంధనల ప్రకారం.. రిజర్వ్ డే రోజున మళ్లీ మొదటి నుంచి మ్యాచ్ ప్రారంభించారు. అప్పటికీ వర్షం అడ్డంకిగా మారడంతో ఇరు జట్లు టైటిల్‌ను షేర్ చేసుకున్నాయి.
ప్రస్తుత టోర్నమెంట్‌లో గ్రూప్ దశలో మెల్‌బోర్న్ మైదానంలో మూడు మ్యాచ్‌లు బంతి పడకుండానే రద్దయ్యాయి. వర్షం కారణంగా మరో మ్యాచ్‌ను కుదించారు.